అధికారం
నిలబెట్టుకునేందుకు పాలక వైసీపీ అడ్డదారులు తొక్కడంతో పాటు అక్రమాలకు పాల్పడుతోందని
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు.
కాకినాడ
రూరల్ లో ఏప్రిల్ 2న లారీల్లో చీరలు,
బొట్టుబిళ్ళలు, డూప్లికేట్ ఈవీఎంలు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు
పట్టుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సీ విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు
చేశామన్నారు.
అక్రమాలను అడ్డుకున్న బీజేపీ నేతలపై వైసీపీ రౌడీలు దాడి చేశారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమాలు, అరాచకాలు అడ్డుకున్న బీజేపీ
కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులు చేయడం దుర్మార్గమన్నారు.
ఆధారాలతో
సహా వాహనాలు పట్టుకున్నా ఎందుకు సీజ్ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఓట్ల
కొనుగోలుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేపట్టారని ఆరోపించారు.
ఓటర్లను ప్రలోభపెట్టడం
లేదా భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని
మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్న అధికారులపై కూడా
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ అధికారపార్టీతో
అంటకాగుతున్న అధికారుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి, కేంద్ర
ఎన్నికల సంఘానికి అందజేశారన్నారు.