Sanjay Nirupam says Jai Shriram, hints future course
మహారాష్ట్రలో కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్
నిరుపమ్ తన మనసులో మాటను బైటపెట్టేసారు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అన్న
ప్రశ్నకు జవాబిస్తూ ‘‘నాకు కచ్చితంగా ప్రణాళికలున్నాయి. వెల్లడిస్తాను. జై
శ్రీరామ్ అంటున్నానంటే అర్ధం చేసుకోండి’’ అన్నారు. అంతకుముందు, ఈ ఉదయం నెహ్రూ తరహా
లౌకికవాదాన్ని విమర్శించారు.
59ఏళ్ళ సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర కాంగ్రెస్‌లో
సీనియర్ నేత. అయితే ఉద్ధవ్ థాకరే పార్టీ శివసేన యుబిటితో పొత్తు విషయంలో సంజయ్
అసంతృప్తితో ఉన్నారు. వాయవ్య ముంబై ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు.
అయితే ఆ స్థానం నుంచి శివసేన యుబిటి తమ అభ్యర్ధిని ప్రకటించింది.
సంజయ్ నిరుపమ్ 2009లో ముంబై ఉత్తర నియోజకవర్గం
నుంచి విజయం సాధించారు. కానీ 2014లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 2019లో వాయవ్య
ముంబై నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఈసారి కూడా ఆ నియోజకవర్గం నుంచే పోటీచేసి
తీరతానని సంజయ్ చెబుతున్నారు.
వాయవ్య ముంబై సీటు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్
షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ చేతిలో ఉంది. అక్కడ ఆ పార్టీ తమ అభ్యర్ధిని ఇంకా
ప్రకటించాల్సి ఉంది.
ఉద్ధవ్ థాకరే శివసేన ఆ నియోజకవర్గం నుంచి అమోత్ కీర్తికర్‌ను
అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే ‘‘అమోత్‌ను ఎట్టి పరిస్థితిలోనూ అక్కడినుంచి
గెలవనివ్వను, నేనే పోటీ చేసి అతన్ని ఓడగిస్తాను’’ అంటున్నారు సంజయ్ నిరుపమ్.
మిత్రపక్ష అభ్యర్ధిని వ్యతిరేకిస్తుండడం, పార్టీ
క్రమశిక్షణను అతిక్రమించడం, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అనే కారణాలు చూపి
కాంగ్రెస్, సంజయ్ నిరుపమ్‌ను నిన్ననే సస్పెండ్ చేసింది.
ఈ ఉదయం ఒక సందర్భంలో మాట్లాడుతూ సంజయ్ నిరుపమ్
నెహ్రూ తరహా లౌకికవాదాన్ని విమర్శించారు. ‘‘సెక్యులరిజం అంటే ఒక వ్యక్తి తన సొంత మతాన్నే
తక్కువ చేసి చెప్పుకోవడం కాదు… సమాజంలో మతానికి చోటు లేదని చెప్పే నెహ్రూ తరహా
లౌకికవాదానికి కాలం చెల్లింది’’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకూ వ్యతిరేకంగా సంజయ్
నిరుపమ్ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొంతకాలం నుంచీ ఆయన అలాగే
మాట్లాడుతున్నారు.
‘కాంగ్రెస్ అనేది ఇక చరిత్రలో కలిసిపోయింది.
దానికి భవిష్యత్తు లేదు. మహా వికాస్ అఘాడీ అనేది మూడు దివాలా తీసిన యూనిట్ల కలయిక
మాత్రమే’ అని తన బహిష్కరణ అనంతరం సంజయ్ నిరుపమ్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆ సందర్భంలోనే ‘కాంగ్రెస్‌లో ఐదు అధికార
కేంద్రాలున్నాయి. ముగ్గురు గాంధీలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ
ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ నాయకత్వం నా మాట వినలేదు. మహారాష్ట్రలో పొత్తు
కుదుర్చుకున్న పద్ధతి చాలా తప్పు. నా స్థానం సహా పలు సీట్లను శివసేన యుబిటికి కేటాయించడం
పెద్ద తప్పు. వాళ్ళు శివసేనకు లొంగిపోయారు. నా సీటును ఈడీ పరిశీలనలో ఉన్న ఒక
మోసగాడికి ఇచ్చారు’’ అంటూ పరుష పదజాలంతో రెచ్చిపోయారు.
ఈ నేపథ్యంలో సంజయ్ నిరుపమ్ బీజేపీలో చేరడం ఖాయంగా
కనిపిస్తోంది.