గత
పదేళ్ళలో జరిగిన అభివృద్ధి ‘ట్రైలర్’ మాత్రమేనన్న ప్రధాని మోదీ, మూడోసారి అధికారమిస్తే అంతకు మించి చేస్తామన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
పదేళ్ళ పాలనను కొనియాడిన ప్రధాని నరేంద్రమోదీ, తమ
కూటమిని మూడో సారి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎన్నికల
ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటించిన ప్రధాని మోదీ, జముయ్ బహిరంగ సభ వేదికగా ప్రసంగించారు.
బిహార్ తో పాటు దేశం నలుమూలల బీజేపీ, ఎన్డీయే
అనుకూల వాతావరణం ప్రతిధ్వనిస్తోందన్నారు. గత పదేళ్ళ ఎన్డీయే పాలన ట్రైలర్ మాత్రమే
నన్న మోదీ, అంతకు మించి చేయాల్సి ఉందన్నారు. దేశ
పురోగతి కోసం ప్రజలంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇండీ
కూటమి పై ప్రధాని మోదీ మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. ఇండీ కూటమిలో
భాగస్వామిగా ఉన్న పార్టీ అంటూ ఆర్జేడీ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో బిహార్ ప్రజలు రైళ్ళలో కిక్కిరిసిన వాతావరణంలో
ప్రయాణించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం బిహార్ ప్రజలు వందే భారత్ లో రాకపోకలు
సాగిస్తున్నారని వివరించారు. రైల్వే
ఉద్యోగాల పేరిట పేదల భూములు కాజేసిన నేతలు బిహార్ కు ఎప్పటికీ న్యాయం చేయలేరంటూ
ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్
పాలనలో ప్రపంచం దృష్టిలో భారత్ బలహీన దేశంగా ఉండేదన్న ప్రధాని మోదీ, ఎన్డీయే పాలనలో మాత్రమే గ్లోబల్ లీడర్
గా ఎదిగిందన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ
పాలనలో దేశ ప్రతిష్ట మసకబారిందని దుయ్యబట్టిన మోదీ, అభివృద్ధి చెందిన భారత్(వికసిత్ భారత్), సౌభాగ్య బిహార్ లక్ష్యంగా బీజేపీ, ఎన్డీయే
పాటుపడుతున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా
భారత్ అవతరించిందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం ఓ వైపు పరిశ్రమలు ఏర్పాటుకు కృషి
చేస్తుంటే , ప్రతిపక్ష నేతలు మాత్రం కిడ్నాప్ లకు
పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్డీయే పాలనలో సోలార్ విద్యుత్, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తుంటే
దురాంహకార నేతలు మాత్రం లాంతరు యుగానికి తీసుకెళుతున్నారని ఆర్జేడీ నేతల తీరును
ఎండగట్టారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోనే రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)పార్టీ ఎన్నికల
గుర్తు లాంతరు.
లోక్
జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
దివంగత రామ్ విలాస్ పాశ్వన్ ను మోదీ ఎన్నికల సభలో గుర్తు చేసుకున్నారు. రామ్
విలాస్ పాశ్వాన్ ఆశయాల సాధనకు ఆయన
కుమారుడు చిరాగ్ పాశ్వాన్,
నిజాయితీ, శ్రద్ధతో కృషి చేస్తున్నారన్నారు. రామ్ విలాస్ పాశ్వన్
మరణం తర్వాత బిహార్ లో మొదటి సారి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన లేని లోటు
పూడ్చలేనిదన్నారు. బిహార్ ఆత్మగౌరవానికి
ప్రతీకైన భారత రత్న, మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ ను
అవమానించేలా ఆర్జేడీ, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని
విమర్శించారు.