వేసవిలో
భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.
దీంతో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. మండే ఎండకు తోడు వడగాడ్పులతో
నానా యాతన అనుభవించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా పలు
జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ శాఖ సూచించింది.
వాతావరణ
శాఖ నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడంతో జాగ్రత్తలు తీసుకోవచ్చు అని
అధికారులు తెలిపారు. వీలైనంత తరచుగా, దాహం
వేయకపోయినా తగినంత నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. తేలికైన, లేత-రంగు, వదులుగా ఉన్న దుస్తులను ధరించడం
మేలని సలహా ఇస్తున్నారు. ఎండలో బయటకు వెళ్ళే
సమయంలో కళ్ళజోడు, గొడుగు లేదా టోపీ,
పాదరక్షలు ధరించాలని చెబుతున్నారు.
ఎండలో
శారీరక శ్రమ చేసే సమయంలో పక్కనే తాగునీరు ఉంచుకోవడంతో పాటు తల, మెడ, ముఖంపై తడివస్త్రం
వేసుకోవడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు. ఓఆర్ఎస్ ద్రావణాలతో పాటు లస్సీ, బియ్యం
నీరు, నీమ్మరసం, మజ్జిగ వీలైనంత ఎక్కువగా తాగడంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా
ఉంటారు.
వడదెబ్బ,
మూర్ఛ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యనిపుణులు సంప్రదించాలని
వాతావరణ శాఖ ప్రకటనలో పేర్కొంది.
పశువులు,
ఇతర పెంపుడు జంతువులను నీడలో ఉంచడంతో పాటు అందుబాటులో పుష్కలంగా నీరు ఉంచాలి. గర్భిణీలు,
చిన్నారులు, వృద్ధులు, రోగులు అదనపు
జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.