Another jolt to INDI alliance, PDP to contest alone in JK
ఇప్పటికే పలు రకాల సమస్యలతో సతమతం అవుతున్న ఇండీ
కూటమికి మరో దెబ్బ తగిలింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలితప్రాంతంలో
తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.
జమ్మూకశ్మీర్ లోని మూడు లోక్సభ స్థానాల్లోనూ నేషనల్
కాన్ఫరెన్స్ పోటీ చేస్తుంది అని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన తర్వాత
మెహబూబా ముఫ్తీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘‘ముంబైలో జరిగిన ఇండీ కూటమి సమావేశంలో నేను
ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పాను. లోక్సభ ఎన్నికల విషయంలో వారు
మాతో మాట్లాడి ఉంటే బాగుండేది. కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒమర్
అబ్దుల్లా మా పార్టీతో మాట్లాడి ఉంటే బహుశా మేమీ ఎన్నికల్లో పోటీ చేయకుండా
ఉండేవాళ్ళమేమో. కానీ, మా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి అసలు ఉనికే లేదన్నట్టుగా
ఒమర్ అబ్దుల్లా ప్రవర్తించడం చాలా బాధపెట్టింది. మా పార్టీని బీజేపీ దెబ్బతీయడం
నిజమే. కానీ ఒమర్ అబ్దుల్లా ప్రకటన మా కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది.
మా పిడిపి గురించి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు నన్నూ నిరాశపరిచాయి. ఇప్పుడిక మనం
పోటీ చేయాల్సిందే అంటూ మా పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన మాటలు మా
పార్టీకి అవమానకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మా పార్టీ
అభ్యర్ధులను పోటీలో నిలుపుతాము’’ అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.
మెహబూబా ప్రకటనపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
‘‘మొత్తం 5 స్థానాల్లోనూ పోటీ చేయాలని ఆమె భావిస్తుంటే అది ఆమె ఇష్టం. ఆమె చెప్పిన
ఫార్ములా ప్రకారమే మేము 3 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాం. ఇప్పుడు మెహబూబా తన
అభ్యర్ధులను నిలబెడితే, బహుశా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తూ వద్దని
భావిస్తోందేమో. మేం తలుపులు తెరిచి ఉంచాం, కానీ ఆ తలుపులను ఆవిడే మూసేసింది. అది
మా తప్పు కాదు’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్ స్థానిక పార్టీలైన నేషనల్
కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ… రెండూ ఇండీ కూటమిలో ఉన్నాయి. వారి
మధ్య పొరపొచ్చాలతో ఇప్పుడు కూటమికి నష్టం వాటిల్లుతోంది.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 5 లోక్సభ
నియోజకవర్గాలున్నాయి. ఉధంపూర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలోను, జమ్మూ
నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశలోను, అనంతనాగ్-రాజౌరీ నియోజకవర్గానికి మే 7న
మూడో దశలోనూ, శ్రీనగర్ నియోజకవర్గానికి మే 13న నాలుగో దశలోనూ, బారాముల్లా
నియోజకవర్గానికి మే 20న ఐదో దశలోనూ ఎన్నికలు జరుగుతాయి.