సినీనటి, మాండ్య నియోజకవర్గ ఎంపీ సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సుమలత, పోటీకి దూరంగా ఉంటూ మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామిగా మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు.
తాను మాండ్యను వీడటం లేదన్న సుమలత, రాబోయే రోజుల్లో కూడా మాండ్య నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించిన సుమలత, బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీజేపీని వదులుకోవద్దు అని ప్రధాని మోదీ కోరినప్పుడు, ఆయన మాటను నేను గౌరవించాలి కదా అని కార్యకర్తలకు వివరించారు. వేరే స్థానం నుంచి పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ కోరినప్పటికీ తిరస్కరించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ లో చేరాలని కొంతమంది మద్దతుదారులు కోరినప్పటికీ ఆమె వ్యతిరేకించారు. ఆత్మాభిమానం కల వ్యక్తిగా కాంగ్రెస్ లో చేరలేరన్నారు. తన అవసరం కాంగ్రెస్ కు లేదని ఓ నేత మాట్లాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
మాండ్య నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత బీజేపీ మద్దతుతో.. కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై విజయం సాధించారు. గతేడాది మే లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించారు.
కర్ణాటకలో 25 లోక్ సభ సీట్ల బీజేపీ పోటీ చేస్తుండగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్ మూడు స్థానాల్లో పోటికి దిగింంది.