CAA eligibility certificates for Hindu immigrants from
Pakistan
పాకిస్తాన్లో దారుణమైన పీడనకు, మతహింసకూ గురై
భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు ఆశ్రయం కల్పించడం, వారికి చట్టబద్ధమైన
గుర్తింపు ఇప్పించడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ ‘సీమాజన్
కళ్యాణ్ సమితి’ కృషి చేస్తోంది. గత వారం రోజులుగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో
పాకిస్తానీ హిందూ శరణార్థులకు క్యాంపులు నిర్వహిస్తోంది. ఆ క్యాంపుల ద్వారా వారికి
అర్హత సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారత
పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోడానికి ఆ అర్హత సర్టిఫికెట్లు అవసరం.
సీమాజన్ కళ్యాణ్ సమితి ప్రస్తుతం పాకిస్తాన్
సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తోంది. బాఢ్‌మేర్, జైసల్మేర్, జోధ్పూర్లలో
నివసిస్తున్న 300కు పైగా శరణార్థులకు సహాయం అందజేసింది. శరణార్థులకు పౌరసత్వం కోసం
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్లో వారి డాక్యుమెంట్లను అప్లోడ్
చేస్తోంది.
సీమాజన్ కళ్యాణ్ సమితి కేంద్రప్రభుత్వం వద్ద రిజిస్టర్
అయిన సంస్థ కావడంతో శరణార్థులకు అర్హత సర్టిఫికెట్లు జారీ చేసేందుకు దానికి
అధికారం ఉందని ఆ సంస్థ సభ్యుడు, అడ్వొకేట్ అయిన విక్రమ్‌సింగ్ రాజ్‌పురోహిత్
వెల్లడించారు. ఆ సర్టిఫికెట్లను స్థానిక పూజారులు కూడా జారీ చేయవచ్చు. దరఖాస్తుదారులు
హిందువులే అని వారు నిర్ధారించి వారికి పౌరసత్వానికి అర్హత ఉందని సర్టిఫై చేయగలరు.
తద్వారా హిందూ శరణార్థులకు పౌరసత్వం పొందేందుకు వీలు కలుగుతుంది.
పాకిస్తాన్ నుంచి ఏదో ఒకరకంగా భారత్ వచ్చి,
ఇక్కడి పౌరసత్వం కోసం ఎన్నోయేళ్ళుగా అగచాట్లు పడుతున్న వారికి సీమాజన్ కళ్యాణ్
సమితి చేస్తున్న ఈ సహాయం కొత్త ఊపిరులు
అందిస్తోంది. పౌరసత్వం పొందడానికి గతంలోనూ విధానాలున్నా, అవి ఎప్పుడూ సరిగ్గా అమలు
కాలేదు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. శరణార్థుల్లో
కొత్త ఆశలు చిగురించాయి. 1998లో భారత్‌కు వచ్చి ఇప్పటికీ ఇంకా పౌరసత్వం కోసం
ఎదురుచూస్తున్న ఒక మహిళ కష్టాలు తనను కలచివేసాయని రాజ్‌పురోహిత్ చెప్పుకొచ్చారు. ఒక్క
జోధ్‌పూర్‌లోనే పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులు సుమారు 6వేల మంది
ఉన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో పాకిస్తానీ హిందూ
శరణార్థులు నివసిస్తున్న సెటిల్మెంట్లు 400 వరకూ ఉన్నాయి. వాటిలో సుమారు 2లక్షల
మంది శరణార్థులు ఉన్నారు. వారంతా ఒకేసారి భారత్‌లోకి వచ్చిన వారు కారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే వారందరూ భారత్‌లోకి చట్టబద్ధంగా, తమ ఉనికితో
వచ్చినవారే. తీర్థయాత్రల కోసమో, పర్యాటక వీసాల మీదనో వచ్చినవారే. వారందరూ 1955
నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్లు 5,6 కింద భారత్‌లో పౌరసత్వం పొందడానికి అర్హత
ఉన్నవారే.
ఇప్పుడు అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఆ శరణార్థులందరికీ
గొప్ప ఊరటగా నిలిచింది. భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి ఒక మెరుగైన దారిని
చూపించింది. చట్టబద్ధమైన పద్ధతుల్లో భారత్‌లోకి శరణార్థులుగా ప్రవేశించిన వారికి
పౌరసత్వం పొందడానికి అర్హత వ్యవధిని 12ఏళ్ళ నుంచి 5ఏళ్ళకు తగ్గించారు. అయితే ఇంకా
కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఉదాహరణకి, పశ్చిమ బెంగాల్లోకి వచ్చిన మతువా తెగకు చెందిన
హిందువుల బంగ్లాదేశ్ నుంచి 1971 యుద్ధం సమయంలోనూ, ఆ తర్వాతా వలస వచ్చారు. వాళ్ళ
గురించి అదనపు సమాచారం కావాలని సీఏఏ పోర్టల్ అడుగుతోంది. అలాంటి కొన్ని సమస్యలను
పరిష్కరించి, హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రం సుముఖంగానే ఉంది.