Boxer Vijender Singh leaves Congress, joins BJP
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో
షాక్ తగిలింది. ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ ఆ పార్టీని వీడి, భారతీయ జనతా
పార్టీలో చేరారు.
ఒలింపిక్ పతక విజేత అయిన విజేందర్ సింగ్ 2019లో
కాంగ్రెస్‌లో చేరారు. ఆనాటి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా పోటీ చేసారు. బీజేపీ అభ్యర్ధి రమేష్ బిధూరీ చేతిలో ఓడిపోయారు.
కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో విజేందర్ సింగ్‌ను
ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ
బీజేపీ అభ్యర్ధి హేమామాలినిపై పోటీకి 38ఏళ్ళ విజేందర్ సింగ్ మాత్రమే సరైన అభ్యర్ధి
అని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటిది విజేందర్ సింగ్ ఇప్పుడు తమ పార్టీకే
రాజీనామా చేసి ప్రత్యర్థి పక్షంలో చేరడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే.
విజేందర్ వల్ల బీజేపీ ప్రధానంగా హర్యానా, పశ్చిమ
ఉత్తరప్రదేశ్‌లలో బలంగా ఉండే జాట్ కులం ఓట్లను సంఘటితం చేసుకోగలుగుతుంది.
అంతేకాదు, ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రచారానికి విజేందర్ సింగ్ బాగా సాయపడగలడు.
విజేందర్ సింగ్, మన దేశంలో ఒలింపిక్ మెడల్
గెలుచుకున్న మొట్టమొదటి బాక్సర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు.
2006, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాలు సాధించాడు. 2009 వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ
2010 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.