Controversy over play derogatory to Ramayana at
Pondicherry University
పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వార్షిక
సాంస్కృతిక ఉత్సవం ‘ఎళిని 2కె24’లో భాగంగా మార్చి 29న ఒక నాటకం ప్రదర్శించారు. హిందువుల పూజనీయ గ్రంథం రామాయణాన్ని
వక్రీకరించి, అందులోని పాత్రలను అవమానించే విధంగా ఆ నాటక ప్రదర్శన సాగింది. నాటకం చూసి
మండిపడిన విద్యార్ధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నాటక ప్రదర్శనకు బాధ్యులపై
చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు.
నాటకం దృశ్యాలు, దానిపై హిందూ విద్యార్ధుల ఆందోళన
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దాంతో పాండిచ్చేరి పోలీసులు రంగంలోకి
దిగారు. నాటక నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
విశ్వవిద్యాలయం కూడా ఆ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ
కమిటీ నివేదిక ఇచ్చేలోపల, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగాధిపతిని ఆ పదవి నుంచి
వైదొలగాలని యూనివర్సిటీ ఆదేశించింది.
ఆ ఘటనపై ఫిర్యాదు చేసిన విద్యార్ధులకు విశ్వవిద్యాలయం
అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి నందగోపాల్ వివరణ ఇచ్చారు. ఆ సంఘటన గురించి దర్యాప్తు
చేయడానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసామనీ, ఆ కమిటీ నాలుగైదు రోజుల్లో నివేదిక ఇస్తుందనీ
వివరించారు.
‘‘కమిటీ నివేదిక ఇంకా రావలసి ఉంది. ఈలోగా
విభాగాధిపతిని తక్షణం పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించాము. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
విభాగంలోని అందరు ఫ్యాకల్టీ సభ్యుల నుంచి వివరణ కోరాము’’ అని అసిస్టెంట్
రిజిస్ట్రార్ నందగోపాల్, ఫిర్యాదుదారులకు రాతపూర్వకంగా ఏప్రిల్ 1న తెలియజేసారు.
వర్సిటీ క్యాంపస్లో శాంతియుత, సౌహార్దపూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ ఉద్దేశమని,
మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనూ సహించబోమనీ ఆయన వెల్లడించారు.
రామాయణాన్ని అవహేళన చేసేలా నాటకాన్ని
ప్రదర్శించిన ‘టీమ్ సోమయానం’ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎవరి
మతవిశ్వాసాలనూ కించపరచాలన్నది మా నాటకం ఉద్దేశం కాదు. మా బృందంలోనూ వేర్వేరు
సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలు కలిగినవారు ఉన్నారు. మేం అందరి విశ్వాసాలనూ సమానంగా
గౌరవిస్తాం. ఒకవేళ మా నాటకం వల్ల ఎవరివైనా మతవిశ్వాసాలకు విఘాతం కలిగినట్లయితే
వారికి క్షమాపణలు చెబుతున్నాం’’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సుదీర్ఘకాలంగా మన
సమాజాన్ని పట్టిపీడిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ గురించే మా నాటకంలో చర్చించాం’’
అని వివరించారు.
నాటకంలో సీతాదేవినీ, ఆంజనేయుడినీ అవహేళన చేస్తూ
వారిని అవమానిస్తూ ఆ పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీసేలా ప్రదర్శించారు. దానికి
ప్రతిస్సందనగా అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ మార్చి 30న విశ్వవిద్యాలయంలో ఆందోళన
నిర్వహించింది. మార్చి 31న ఏబీవీపీ ఒక ప్రకటన జారీ చేసింది.
‘‘పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్
ఆర్ట్స్ విభాగం 29 మార్చి 2024న ‘ఎళిని 2కె24’ పేరిట ఉత్సవం నిర్వహించింది. అందులో
ప్రదర్శించిన నాటకంలో రామాయణాన్ని అపహాస్యం చేసారు. సీత రావణుడికి ఆవుమాంసం
వడ్డిస్తున్నట్టు చూపారు. ఆంజనేయుడిని అవహేళన చేసారు. ఆ నాటకంలో సీత పేరును ‘గీత’గానూ
రావణుడి పేరును ‘భావనుడి’గానూ మార్చారు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్న సమయంలో సీతతో
‘నేను వివాహితురాలిని, కానీ మనం స్నేహంగా ఉందాం’ అని చెప్పినట్టు చూపించారు’’ అని
ఏబీవీపీ ప్రకటన వివరించింది.
ఈ దేశంలో కొన్ని కోట్లమందికి ఆరాధ్యదైవాలు
సీతారాములు. రామాయణం నిత్యపారాయణ గ్రంథం. అలాంటి గ్రంథాన్ని నీచంగా వక్రీకరించి,
అందులోని పాత్రల ఉదాత్తతను దెబ్బతీసి, హిందువుల విశ్వాసాలను దారుణంగా అవమానించారు.
‘‘రామాయణాన్ని ఇలా వక్రీకరించి, అందులోని పాత్రలను
అవమానించడం విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న వామపక్ష భావజాలం కలిగిన సంస్థల కుట్ర.
కమ్యూనిస్టు, వామపక్ష సంస్థలు దురుద్దేశపూర్వకంగానే రాముడిని అవమానించాలని, సీతమ్మ
పవిత్రతను శంకించాలనీ ఈ విధంగా నాటకాన్ని ప్రదర్శించారు. ఇక హనుమంతుడిని
కాంజనేయుడు అనే పేరుతో చూపించారు. రాముడితో మాట్లాడవలసినప్పుడల్లా తోకను
యాంటెన్నాలా ఎత్తి మాట్లాడినట్లు చూపించారు. ఇలా హిందూధర్మంలో ఆదరణీయ పాత్రలను
అవహేళన చేయడం ద్వారా మతసామరస్యాన్ని చెడగొట్టారు. మెజారిటీ మతస్తుల విశ్వాసాలు,
మనోభావాలను దెబ్బతీసారు’’ అని ఏబీవీపీ తన ప్రకటనలో వివరించింది.
నాటకాన్ని ప్రదర్శించిన ‘టీమ్ సోమయానం’ మాత్రం
ఏబీవీపీపై మండిపడింది. హిందువుల మతవిశ్వాసాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కానేకాదంటూ
బుకాయించింది. ఏబీవీపీ రాజకీయ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది.
‘‘మా ప్రదర్శన వీధినాటకం పద్ధతిలో
ప్రదర్శించాము. పితృస్వామ్యంలో స్త్రీని అణచివేసే విలువల గురించి చర్చించాము.
మహిళలకు శీలమే ముఖ్యం అనే పాతకాలపు ఛాందస విలువల ఈనాటికీ సమాజంలో ఉన్నాయి. అలాంటి
తప్పుడు భావనలను సమాజంలోనుంచి తొలగించాలన్నదే మా నాటకం ఉద్దేశం. మహిళలకు వారి
శీలాన్ని బట్టి విలువ కట్టినప్పుడు పురుషులకు కూడా అదే ప్రాతిపదికగా ఎందుకు లేదని
మా నాటకం ద్వారా ప్రశ్నించాం’’ అంటూ ‘టీమ్ సోమయానం’ తమ చర్యలను సమర్ధించుకుంది.
అంతేతప్ప, హిందువుల మత విశ్వాసాలను అవహేళన చేయలేదంటూ బుకాయించింది.