Israeli Citizen Embraces Sanatan Dharma
ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన ధర్మం సనాతన ధర్మం.
మానవుడి సంపూర్ణ వికాసానికి అవసరమైన జీవన గమనాన్ని అందించడం సనాతన ధర్మం ప్రత్యేకత.
అందుకే విదేశీ పాషండ మతాల తాకిడి ఎంత తీవ్రంగా ఉన్నా, సనాతన ధర్మం సజీవంగా
నిలుస్తోంది. అంతేకాదు, ఎందరో విదేశీయులను సైతం ఆకర్షిస్తోంది, తాజాగా అలాంటి
సంఘటన అస్సాంలోని మజులీ ద్వీపకల్పంలో చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్ దేశ పౌరుడైన ఎడ్గార్ ఫెయిన్గోర్
సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈశాన్యభారతంలో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న శంకరదేవ
వైష్ణవ పద్ధతిని అనుసరిస్తున్నారు.సనాతన
ధర్మ స్వీకరణ తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.
ఇప్పుడు ఫెయిన్గోర్ పేరు కృష్ణశరణ్ భక్త్. ‘‘ఎన్నో
యేళ్ళ అధ్యయనం, పరిశోధన, అభ్యాసం తర్వాతనే నేను వైష్ణవ ధర్మాన్ని అత్యంత
భక్తిశ్రద్ధలతో స్వీకరించాను’’ అని ఆయన చెబుతున్నారు. ‘‘వైష్ణవంలో శ్రీకృష్ణ పరమాత్మకు
పరిపూర్ణంగా శరణాగతి పొందడం ప్రధానం. అది ఆధ్యాత్మిక పరిపూర్ణతను కలిగిస్తుంది’’
అని భావిస్తున్నారు.
మజులీ ద్వీపకల్పంలోని వైష్ణవ సత్రంలో మంగళవారం
జరిగిన కార్యక్రమంలో ఎడ్గార్ ఫెయిన్గోర్ సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఆ మేరకు
సత్రాధికారి ఆయనకు హిందువు అని సర్టిఫికెట్ జారీ చేసారు. దానివల్ల ఇప్పుడు
కృష్ణశరణ్ ప్రపంచంలోని అన్ని హిందూ దేవాలయాలనూ దర్శించుకోవచ్చు.
ఇజ్రాయెల్ దేశీయుడై ఉండి కూడా యూదు, క్రైస్తవ
లేదా ముస్లిం మతాలను వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి చేరాలనుకోడానికి కారణం ఈ ధర్మంలో
ఉన్న దృష్టివైశాల్యమే అని కృష్ణశరణ్ చెబుతున్నారు.