తైవాన్
లో భూకంపం కారణంగా నలుగురు మరణించగా 60 మంది గాయపడ్డారు. కొన్ని నిర్మణాలు పేక
మేడల్లా కూలిపోగా డజన్ల కొద్ది బిల్డింగులకు బీటలు ఏర్పడ్డాయి. దశాబ్ద కాలంలో
తైవాన్ వణికించిన తీవ్రమైన భూకంపంగా
దీనిని నిపుణులు ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందని
హెచ్చరించారు.
పెనుభూకంపంతో
తైవాన్ లోని ఉత్తర తీరప్రాంతం వణికిపోయింది. తైవాన్ రాజధాని తైపే సమీపంలో ఈ ఉదయం
భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది.
తైవాన్
దక్షిణ ప్రాంతంలోని హువాలియెన్ సిటీకి 18
కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంపకేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 34 కిలోమీటర్ల లోతులో సంభవించిన కదలికల
కారణంగా భూమి ప్రకంపించింది. హువాలియెన్ సిటీలో పలు భవనాలు బీటలు వారగా మరికొన్ని
కూలిపోయాయి. వంతెనలు, ఫ్లై ఓవర్లు ఊగిపోయాయి.
భూకంప
ప్రభావం తైవాన్ పొరుగునే ఉన్న దక్షిణ జపాన్ ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్లపైనా పడింది. భూకంప
తీవ్రతకు సముద్రంలో అలలు పోటెత్తాయి. మూడు నుంచి అయిదు మీటర్ల ఎత్తు వరకు
ఎగిసిపడ్డాయి.
జపాన్‌లోని యోనుగుని ద్వీపానికి
ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఒకినావా ప్రిఫెక్చర్‌లోని తీర
ప్రాంతాలకు మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు
రంగంలోకి దిగాయి. సహాయక చర్యల సన్నద్ధతను సమీక్షించాయి. ప్రభావిత ప్రాంతాల్లో
కొన్ని విమాన సర్వీసులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు.
యొనగుని, ఇషిగాకీ, తరమ, మియాకోజిమా
ప్రీఫెక్షర్స్ తీరాల్లో అలలు పోటెత్తాయి. అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్త
చర్యల్లో భాగంగా తీరప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు
తరలించారు. అప్రమత్తంగా ఉండాలని పర్యాటకులను హెచ్చరించారు.