Over 43 Crore digital transactions per month in India
డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో భారత్ శరవేగంతో
దూసుకుపోతోంది. ప్రజలు కూడా డిజిటల్ లావాదేవీలకు చాలా సులువుగా అలవాటయ్యారు. ఆ
విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
తమిళనాడులోని పల్లవరంలో జరిగిన వికసిత్ భారత్
చర్చాకార్యక్రమంలో ప్రసంగిస్తూ డిజిటల్ లావాదేవీల్లో భారతీయుల ఉత్సాహాన్ని
కొనియాడారు.
‘‘భారతదేశం డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా
మారుతోంది. దేశంలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఎలా ఉందంటే విక్రేత,
కొనుగోలుదారు, చెల్లింపు విధానం మూడూ సమన్వయంలో ఉన్నాయి. నెలకు 43కోట్ల 30లక్షల
డిజిటల్ లావాదేవీలు ఎలాంటి ఛార్జిలూ లేకుండా జరుగుతున్నాయి’’ అని నిర్మల
వెల్లడించారు.
నిర్మల తన ప్రసంగంలో భారతదేశం ఇవాళ మొబైల్ ఫోన్ల
తయారీ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు. దేశీయ వినియోగం కోసమే కాకుండా విదేశాలకు
ఎగుమతి చేయడానికి కూడా భారత్‌లో మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయని చెప్పారు. మోదీ
ప్రభుత్వం ప్రయత్నాల వల్లనే ఇది సాధ్యమైందని ఆర్థికమంత్రి చెప్పారు.
‘‘థోరియం, సౌరశక్తి, గ్రీన్‌హైడ్రోజన్ రంగాల్లో
పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలు
అందుబాటులో ఉన్నాయి. పునర్వినియోగ ఇంధన రంగంలో భారత్ కూడా ఇతర దేశాలతో పాటు
పురోగతి సాధిస్తోంది. ఆ రంగంలో భారత్ అతిత్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది’’
అని వివరించారు.
దేశంలో అంకుర సంస్థల విజయాలను ఆర్థికమంత్రి
కొనియాడారు. ‘‘ఇవాళ అంతరిక్ష రంగంలోకి కూడా అంకుర సంస్థలు వస్తున్నాయి. రోదసీ రంగంలో
ప్రైవేటు పెట్టుబడులకు మా ప్రభుత్వం వీలు కల్పించింది. ఆ రంగంలో కొత్తగా
అడుగుపెట్టేవారికి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది, అవసరమైన సహాయం చేస్తోంది.
ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలు, వాటిలో పరిశోధనల కోసం
లక్ష కోట్లు కేటాయించింది. దేశంలో కొత్తగా వస్తున్న అంకుర సంస్థలకు అది పెద్ద ప్రోత్సాహం’’
అని నిర్మల చెప్పుకొచ్చారు.
వికసిత భారత్ సాధించే
క్రమంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతులు కలిగిన పాఠశాలలు, ఆస్పత్రులు
ముఖ్యమైన పరామితులు అని మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మలా
సీతారామన్ వివరించారు.