టర్కీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 29 మంది సజీవదహనం అయ్యారు.మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కీ ఆర్థిక రాజధానిగా భావించే ఇస్తాంబుల్‌లో మాస్క్యురెడ్ అనే నైట్ క్లబ్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
ఇస్తాంబుల్ గ్యారెటెపే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోని 16 అంతస్తులు గల ఓ అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో నైట్ క్లబ్ కొనసాగేది. మరమ్మతులు చేపడుతుండగా స్వల్పస్థాయి పేలుడు సంభవించింది నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ఫైబర్, ప్లాస్టిక్, థిన్నర్ వంటి నిర్మాణ సామగ్రిపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నికీలలు అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు వరకూ అలుముకున్నాయి.
ఆ సమయంలో 40 మంది వరకు కార్మికులు అందులో ఉన్నట్లు ఇస్తాంబుల్ పోలీసులు చెబుతున్నారు. బేస్‌మెంట్ కావడం, బయటికి రావడానికి ఒకేదారి ఉండటం వల్ల కార్మికులు అందులో చిక్కుకుపోయారు. మంటల బారిన పడి 29 మంది సజీవదహనం అయ్యారు. ఘాటు పొగ వల్ల మరికొందరు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.