Both factions of LJP continue in NDA
బిహార్‌లో ఎన్డీయే కూటమిలోనే కొనసాగాలని
రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ నిర్ణయించుకుంది. ఎల్జేపీ (రాంవిలాస్) పక్షానికి
ప్రాధాన్యం ఇచ్చి తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో ఆర్ఎల్జేపీ అధ్యక్షుడు పశుపతి
కుమార్ పారస్ కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలో ఆయన
పార్టీ ఇండీ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే తమ మద్దతు ఎన్డీయేకేనని
పారస్ స్పష్టం చేసారు.
పశుపతి పారస్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బిహార్‌లోని మొత్తం 40 స్థానాల్లోనూ పోటీ
పడుతున్న ఎన్డీయే అభ్యర్ధులకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని ప్రకటించారు.
పారస్‌తో భేటీ వివరాలను నడ్డా తన ఎక్స్ హ్యాండిల్
ద్వారా వెల్లడించారు. ‘‘ఎన్డీయే భాగస్వామి, ఆర్ఎల్జేపీ అధ్యక్షుడు పశుపతి పారస్‌తో
ఇవాళ భేటీ అయ్యాను. ఆర్ఎల్జేపీ మద్దతుతో మా కూటమి మరింత దృఢమయింది. బిహార్‌లోని మొత్తం
40 మంది ఎన్డీయే అభ్యర్ధులకూ ఆర్ఎల్జేపీ పూర్తి మద్దతు ఇస్తోంది. రాబోయే
ఎన్నికల్లో వారందరి విజయానికీ తమవంతు కృషి చేస్తామని పారస్ చెప్పారు’’ అని నడ్డా
ట్వీట్ చేసారు.
బిహార్‌లో రాంవిలాస్ పాశ్వాన్ మరణానంతరం ఆయన
పార్టీ రెండు ముక్కలైంది. కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఎల్జెపి (రాంవిలాస్) పార్టీని,
తమ్ముడు పశుపతి కుమార్ పారస్ ఆర్ఎల్జేపీ పార్టీని నడుపుతున్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే
కూటమి సీట్ల సర్దుబాటులో బీజేపీ పారస్ పార్టీని పక్కన పెట్టి చిరాగ్ పార్టీకి
పెద్దపీట వేసింది. దాంతో పారస్, తమకు ‘బీజేపీ అన్యాయం చేసింది’ అని
వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలో పారస్ ఇండీ
కూటమి వైపు మళ్ళుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వాటన్నింటికీ చుక్క పెడుతూ పారస్ ఇవాళ తమ పార్టీ
భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. ‘‘రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయేలో
భాగస్వామి. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీయే’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
బిహార్‌లో మొత్తం 40 పార్లమెంటు స్థానాలున్నాయి.
ఎన్డీయే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ 17 స్థానాల్లోనూ, నితీష్ కుమార్ పార్టీ
జేడీయూ 16 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ
(రాంవిలాస్) 5 సీట్లలో బరిలోకి దిగుతుంది. స్థానిక పార్టీలైన హిందుస్తానీ ఆవామ్
మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చెరో స్థానంలో పోటీ పడతాయి.