లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ, పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచింది. వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారైంది. చింతలపూడి శాసనసభ్యుడు ఎలి జా, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్కు టికెట్లను కేటాయించింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కమ్యూనిస్ పార్టీలకు కాంగ్రెస్ కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్, కడప ఎంపీ టికెట్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నానని తెలిపిన షర్మిల , తన నిర్ణయం అంత సులువైంది కాదన్నారు. తాను పోటీలో ఉంటే వైఎస్ కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నా అన్నారు.
గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్ అన్నారని గుర్తు చేసిన షర్మిల, అధికారంలోకి వచ్చిన తర్వాత తనన్ను పూర్తిగా విస్మరించారని ఆవేదన చెందారు. వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్ వారిని కాపాడుతున్నారని విమర్శించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానని చెప్పారు.
కాకినాడ నుంచి కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజును బరిలోకి దించింది. కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.