ఎన్నికల నియమావళిని అతిక్రమించిన పలువురు సీనియర్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేర్ కుమార్ మీనాను ఆదేశించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్భురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్లతోపాటు గుంటూరు డీఐజీ పాల్‌రాజును కూడా బదిలీ చేయాలనీ సీఈసీ ఆదేశించింది.
ఆరుగురు ఐపీఎస్‌లతోపాటు, ముగ్గురు ఐఏఎస్‌లపై కూడా బదిలీ వేటు పడింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా, అనంతపురం అధికారి గౌతమిపై బదిలీ వేటు పడింది. బదిలీ వేటు పడిన వారిని సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉంచాలని కూడా సీఈసీ ఆదేశించింది. సీఈసీ ఆదేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సీఎస్, డీజీపీలకు పంపించారు.
గత నెల 17న ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ భద్రతా లోపాలు బయటపడటంతో సీఈసీ సీరియస్‌గా తీసుకుంది. దీనికితోడు కోడ్ వచ్చాక పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటన జరగడంతో ఎస్పీపై బదిలీ వేటు పడింది.