India furious on China renaming Arunachal areas
అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా తమ
భాషలో పేర్లు పెట్టుకోడంపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి
కిరెన్ రిజిజు చైనా దుందుడుకు చర్యలను ఖండించారు. చైనా చేస్తున్న నిరాధార ప్రకటనలు
క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చలేవని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్భాగమైన 30 ప్రదేశాలకు
చైనా అక్రమంగా తమ భాషలో పేర్లు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చైనా భారత్
మీద చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి. అలాంటి ఆరోపణలు చారిత్రక వాస్తవాలను,
క్షేత్రస్థాయి నిజాలనూ మార్చలేవు’’ అని కిరెన్ అన్నారు.
‘‘అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్గత భాగం. దాన్ని
ఎవరూ వేరు చేయలేరు. ఆ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా చూసుకున్నా గొప్ప దేశభక్తులే’’ అని
కిరెన్ రిజిజు ట్వీట్ చేసారు.
అంతకుముందు, భారత
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా చైనా దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘నేను
మీ ఇంటికి వచ్చి దాని పేరును మారిస్తే, అది నా ఇల్లు అయిపోతుందా? అరుణాచల్ ప్రదేశ్
ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలు ఎలాంటి ప్రభావాన్నీ
చూపలేవు’’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు.