ఉచితాలను వ్యతిరేకించే టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద కష్టమే వచ్చిపడింది. గడచిన నాలుగు సంవత్సరాల 9 నెలలుగా రాష్ట్రంలో 55 లక్షల మందికి ఇంటికే పింఛన్లు అందిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో వలంటీర్ల ద్వారా నగదు పంపిణీ ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో లబ్దిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపాలని రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, హైకోర్టులో పిల్ వేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వలంటీర్ల ద్వారా నగదు పంపిణీ ఆపాలని సీఈసీ ఆదేశించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అడ్డంగా ఇరుక్కుపోయారు. చంద్రబాబే హైకోర్టులో పిల్ వేయించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ప్రారంభించారు.
రాష్ట్రంలో వృద్దాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వలంటీర్లు సేవలు నిలిపివేయడంతో ఇంటింటికి పింఛను పంపిణీ సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల కనీసం పది రోజులపైనే పింఛన్ల పంపిణీకి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల వద్ద వందల సంఖ్యలో లబ్దిదారులు బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చంద్రబాబుకు నష్టం తెచ్చేవిగా ఉన్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితి చంద్రబాబు ఊహించలేదు. దీంతో ప్రభుత్వం వద్ద నగదు లేకనే ఇంటింటికి పంపిణీ చేయడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు.
సీఎం జగన్మోహన్రెడ్డి కమిషన్లు తీసుకుని అనుయాయులకు 13500 కోట్లు దోచిపెట్టాడని, అందుకే ప్రభుత్వం వద్ద డబ్బు లేకుండా పోయిందని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 35 వేల మంది పనిచేస్తున్నారని, వారితో ఇంటింటికి పింఛను పంపిణీ చేయించాలని ఆయన సీఎస్‌కు లేఖ కూడా రాశారు. వలంటీర్ల సేవలు నిలిపివేయాలనే టీడీపీ నాయకుల ప్రయత్నం ఫలించింది, కానీ అది ఎన్నికల్లో వారికే చేటు తెచ్చేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.