భద్రాద్రి రాములోరి కళ్యాణం సమీపిస్తోన్న వేళ, స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే పంపేందుకు తెలంగాణ ఆర్టీసీ, పోస్టల్ శాఖ ఏర్పాట్లు చేశాయి. రాములోరి తలంబ్రాలు కావాల్సిన వారు రూ.151 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికి వచ్చి అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
గత ఏడాది కూడా ఈ సౌకర్యాన్ని లక్షలాది మంది ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది కూడా తలంబ్రాలు ఇంటికే సరఫరా చేయాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు.
రాములోరి తలంబ్రాలు కావాల్సిన వారు ముందుగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ఆవిష్కరించారు. రెండేళ్ల నుంచి తెలంగాణ ఆర్టీసీ ఈ సేవలు అందిస్తోంది. భక్తుల నుంచి వేశేషంగా ఆదరణ రావడంతో దీన్ని మరింత విస్తరిస్తున్నారు. గత ఏడాది రాములోరి తలంబ్రాలను లక్షా 17 వేల మందికి ఇంటికే అందించారు. ఈ ఏడాది లక్షన్నర మందికి అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17న భద్రాచలంలో రాములోరి కల్యాణం రంగరంగ వైభవంగా జరగనుంది. తలంబ్రాలు కావాల్సిన వారు 040-23450033, 040-69440000, 040-69440069 నంబర్లకు కాల్ చేయవచ్చు.