What is Katchatheevu controversy?
కచ్చత్తీవు దీవి గురించి మోదీ వ్యాఖ్యలకు
కొనసాగింపుగా, విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మరో దిగ్భ్రాంతికర విషయాన్ని
వెల్లడించారు. ‘కచ్చత్తీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేయాలి అని భావించినది దేశపు మొదటి
ప్రధానమంత్రి జవాహర్లాల్ నెహ్రూ, ఆయన కచ్చత్తీవు విషయాన్ని ఒక తలనొప్పిగా, ఒక
పీడగా భావించారు’ అని జయశంకర్ బహిర్గతం చేసారు.
కచ్చత్తీవు, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల
వెడల్పు ఉన్న నిర్మానుష్యమైన ఒక చిన్న దీవి. 1974లో భారత్-శ్రీలంక మారిటైమ్
అగ్రిమెంట్ పేరిట అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసింది. ఆనాటి
ఒప్పందం గురించి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై సమాచార హక్కు
చట్టం కింద వేసిన పిటిషన్‌కు లభించిన జవాబు ఆధారంగా ఒక మీడియా సంస్థ కథనం
వెలువరించడంతో ఈ విషయం ఇన్నాళ్ళకు వెలుగులోకి వచ్చింది.
1976 ఎమర్జెన్సీ సమయంలో అప్పటి తమిళనాడు
ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్రప్రభుత్వం డిస్మిస్ చేసిన తర్వాత భారత్-శ్రీలంక మరో ఒప్పందం
చేసుకున్నాయి. ఒక దేశపు ప్రాదేశిక జలాల్లో మరో దేశపు జాలర్లు చేపలు పట్టుకోకూడదు
అని దాని సారాంశం. తమిళ జాలర్లను లంక అధికారులు నిర్బంధించి హింసిస్తుండడం ఆ
రాష్ట్రంలో పెద్ద సమస్య.
దివంగత, గత ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంలో డీఎంకే,
కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా విమర్శించేవారు. శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లు
వేటాడుకోడానికి శాశ్వతంగా అనుమతించేలా ఒప్పందం కుదుర్చుకోవాలని జయలలిత డిమాండ్
చేసేవారు. అంతేకాదు, కచ్చత్తీవు దీవిని భారత్ స్వాధీనం చేసుకోవాలని ఆమె ఒత్తిడి
చేస్తుండేవారు.
విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ విషయం గురించి
మాట్లాడుతూ మాజీ విదేశాంగ మంత్రి స్వరణ్ సింగ్ 1974లో పార్లమెంటులో చేసిన
ప్రసంగంలోని మాటలను ఉటంకించారు. ‘‘పాక్ అఖాతంలో ప్రాదేశిక జలాల్లోని సరిహద్దును
(మారిటైమ్ బౌండరీ) నిర్ణయించుకునే ఒప్పందం రెండు దేశాలకూ సమన్యాయం చేస్తోందని భావిస్తున్నాను.
అదే సమయంలో, నేనొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని కుదుర్చుకునే
సమయంలో – చేపల వేట, పుణ్యక్షేత్ర సందర్శన, నావిగేషన్ వంటి విషయాల్లో గతంలో రెండు
పక్షాలూ ఏయే హక్కులను కలిగి ఉండేవో, భవిష్యత్తులో కూడా ఆ హక్కులు అలాగే
కొనసాగుతాయి’’ అని స్వరణ్ సింగ్ స్పష్టంగా చెప్పారు.
జయశంకర్ తదుపరి పరిణామాలను వివరించారు.
రెండేళ్ళలోపే భారత్ – శ్రీలంక మధ్య మరో ఒప్పందం కుదిరింది. ‘‘ఇరు దేశాలూ ప్రత్యేక
ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేసుకోవడంతో భారత్, శ్రీలంక రెండూ తమతమ జోన్లలోని
సజీవ, నిర్జీవ వనరులపై పూర్తి సార్వభౌమ హక్కులను కలిగి ఉండాలి అని భారత్
ప్రతిపాదించింది. భారత్‌కు చెందిన జాలర్లు, వేటపడవలు శ్రీలంక ప్రత్యేక జోన్‌తో
పాటు అక్కడి ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట చేయకూడదు అని స్పష్టం చేసింది’’
అని జయశంకర్ చెప్పారు. ‘‘1974లో ఒక హామీ ఇచ్చారు, కానీ దాన్ని తుంగలో తొక్కుతూ 1976లో
ఒప్పందం చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు.
1976లో చేసిన ఆ తప్పు ఫలితంగా గత 20 ఏళ్ళలో
శ్రీలంక 6184 మంది భారతీయ జాలరులను నిర్బంధించింది, భారతదేశానికి చెందిన 1175
ఫిషింగ్ బోట్లను సీజ్ చేసింది.
‘‘గత ఐదేళ్ళలో కచ్చత్తీవు వివాదం గురించి పార్లమెంటులో
ఎన్నో పార్టీలు ప్రస్తావించాయి. నిజానికి స్వయానా తమిళనాడు ముఖ్యమంత్రే నాకు
ఎన్నోసార్లు లేఖలు రాసారు. నా రికార్డుల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రికి (ఎంకె
స్టాలిన్) నేను ఈ విషయం మీద 21సార్లు జవాబులు రాసాను. ఇదేమీ ఇప్పటికిప్పుడు తెర
మీదకు వచ్చిన విషయం కాదు. ఈ గొడవ చాలాకాలం నుంచే జరుగుతోంది’’ అని జయశంకర్
వివరించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి బాధ్యతా లేనట్లు వ్యవహరిస్తున్నాయి,
కానీ ఈ పరిస్థితికి దారి తీసిన కారణమేంటో ప్రజలు తెలుసుకోవాలి’’ అని ఆయన
వ్యాఖ్యానించారు.
‘‘ఈ పరిస్థితి ఇలా ఎందుకు పరిణమించింది, దీనికి
కారకులు ఎవరు అన్నది మాకు తెలుసు… కానీ మాకు తెలీనిది ఏంటంటే… ఈ విషయాన్ని
దాచి ఉంచింది ఎవరు? ప్రజల నుంచి దాచిఉంచిన విషయం ఏంటి?’’ అని జయశంకర్
వ్యాఖ్యానించారు. జయశంకర్ ఈ దీవి గురించి మొత్తం వివరాలు తెలియజేసారు.
కచ్చత్తీవు దీవి బ్రిటిష్ వారి కాలం నుంచే
రామనాదపురం రాజాకు చెందినది. తర్వాత ఆ దీవిపై ఆయనకున్న హక్కులు మదరాసు
ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. కచ్చత్తీవు దీవిపై హక్కు ఎవరిది అన్న విషయానికి
సంబంధించి శ్రీలంక దగ్గర ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలూ లేవు. కానీ తమ దగ్గరున్న
రికార్డులు 17వ శతాబ్దానికి చెందినవి అని శ్రీలంక వాదిస్తూంటుంది.
భారత్, శ్రీలంక రెండు దేశాలూ స్వతంత్రదేశాలుగా
ఏర్పడ్డాక కచ్చత్తీవు దీవిని ఎలా వాడుకోవాలి అన్న సమస్య తలెత్తింది. 1974లో
శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే, భారత్ ప్రధాని ఇందిరాగాంధీ ఆ విషయం గురించి
చర్చించుకున్నారు.
1958లో అప్పటి అటార్నీ జనరల్ ఎంసి సెతల్వాద్ ఆ
దీవి గురించి న్యాయపరమైన అభిప్రాయం చెబుతూ ఆ దీవి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ భారతదేశ
సార్వభౌమాధికారపు పరిధిలోనే ఉండేది అని నిర్ధారించి చెప్పారు.
అయితే అప్పట్లో కీలకమైన వ్యక్తులు ‘మనం దీవిని
వదిలేసుకున్నా, కనీసం ఆ దీవి పరిసర ప్రాంతాల్లో చేపల వేట హక్కుల కోసమైనా ఒత్తిడి చేయాలి’
అని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ 1974లో దీవిని ఇచ్చేసాం, 1976లో ఆ దీవి మీద మనకున్న
హక్కులనూ వదిలేసాం. అలా జరగడానికి చాలా కారణాలున్నాయి’’ అని జయశంకర్ చెప్పారు.
‘‘భారతదేశపు అంతర్భాగమైన ఆ కచ్చత్తీవు దీవి
విషయంలో ఆనాటి ప్రధానమంత్రి, అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
నిజానికి, వారు ఏమాత్రం లక్ష్యపెట్టలేదు’’ అని జయశంకర్ వివరించారు.
1961 మే నెలలో జవాహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ… ‘‘ఆ
చిన్న దీవికి నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ఆ దీవిపై మన హక్కును వదిలేసుకునే
విషయంలో నేను ఏమాత్రం సంకోచించను, ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఇలా ఎంతకాలం
పెండింగ్ ఉంటాయో తెలీని, పార్లమెంటులో మళ్ళీమళ్ళీ ప్రస్తావనకు వచ్చే విషయాలంటే
నాకు ఏమాత్రం నచ్చదు’’ అని చెప్పారు.
‘‘అంటే, పండిట్ నెహ్రూకు ఇది ఒక చిన్న దీవి. ఆయన
దీన్ని ఒక తలనొప్పిగా, పీడగా మాత్రమే చూసారు. దాన్ని ఎంత త్వరగా (శ్రీలంకకు)
ఇచ్చేస్తే అంత మంచిదని నెహ్రూ భావించారు’’ అని జయశంకర్ వివరించారు.
అదే ధోరణి శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలోనూ
కొనసాగింది. ‘‘ఒకానొక కాంగ్రెస్ సమావేశంలో ఇందిరా గాంధీ ఆ దీవిని ‘ఒక చిన్న రాయి
మాత్రమే’ అంది. కచ్చత్తీవు విషయంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా చూపించిన వైఖరి ఆ
నిర్లక్ష్యమే’’ అని జయశంకర్ వివరించారు.
కచ్చత్తీవు విషయంలో కాంగ్రెస్, డీఎంకేల
నిర్లక్ష్య వైఖరి గురించి ప్రధాని మోదీ ఆదివారం వివరించారు. ‘‘కచ్చత్తీవును
కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యంగా ఇచ్చేసిందో కొత్త నిజాలు చెప్పాయి. ఆ పరిణామాలు ప్రతీ
భారతీయుడి మీదా ప్రభావం చూపాయి. మనం కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మలేము’’ అని మోదీ
సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అక్కడే ఆర్టీఐ నివేదిక ప్రతిని కూడా పోస్ట్
చేసారు.
తమిళనాడు ప్రయోజనాలను కాపాడడానికి డీఎంకే చేసింది
కూడా ఏమీ లేదని ప్రధాని అన్నారు. ‘ఆ దీవి గురించి నిర్ణయం తీసుకోడంలో నాటి ప్రధాని
ఇందిరాగాంధీ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధిని పరిగణనలోకి తీసుకున్నారు,
కానీ తమిళుల ప్రయోజనాలు కాపాడడానికి డీఎంకే చేసింది కూడా ఏమీలేదు’ అని మోదీ ట్వీట్ చేసారు.
మొత్తంగా చూస్తే… తమిళనాడు బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు అన్నామలై వేసిన సమాచార హక్కు పిటిషన్, భారత్ శ్రీలంక మధ్య
వివాదాస్పదంగా నిలిచిన కచ్చత్తీవు దీవి విషయంలో మొట్టమొదట్నుంచీ కాంగ్రెస్
నాయకత్వం వైఖరి ఎంత ఉదాసీనంగా, ఎంత దౌర్భాగ్యంగా ఉందో తేటతెల్లం చేసింది.