China renames 30 territories of Arunachal to claim ownership
మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ను తమది అని
చెప్పుకోడానికి చైనా పాల్పడుతున్న దురాగతాలు అన్నీఇన్నీ కావు. తాజాగా ఆ ప్రదేశంలోని
కొన్ని ప్రదేశాలకు తమ పేర్లు పెట్టుకుంది. ఆ కొత్త పేర్లను శనివారం నాడు ప్రకటించింది.
చైనా, మన అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జాంగ్‌నన్’ అని, అది
టిబెట్‌లో అంతర్భాగమనీ వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ప్రాంతంలోని 30 ప్రదేశాలకు తమవైన
పేర్లు పెట్టేసుకుంది. వాటిలో 11 నివాస ప్రాంతాలు, 12 కొండలు, 4 నదులు, ఒక సరోవరం,
ఒక కొండదారి, ఇంకొక భూభాగమూ ఉన్నాయి. వాటి
పేర్లను చైనీస్ భాషలో, టిబెటన్ లిపిలో ప్రకటించారు.
చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ చర్యను
సమర్ధించుకుంది. జాంగ్‌నన్‌లోని భూభాగాల పేర్ల నిర్వహణ, తమ స్టేట్ కౌన్సిల్‌కు ఉన్న
అధికారాల పరిధిలోని అంశమేనంటూ చెప్పుకుంది.
చైనా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లోను,
అంతకుముందు 2021, 2017లోనూ కలిపి 32 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టింది.
చైనా వైఖరిని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్‌పై
తమ యాజమాన్యాన్ని ప్రకటించుకోడానికి చైనా పదేపదే చేస్తున్న ప్రయత్నాలను
తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా
భారతదేశంలో అంతర్భాగమని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ భారత్‌లో
అంతర్భాగంగానే ఉండేది, ఉంది, ఉండబోతుంది అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
విస్పష్టంగా ప్రకటించారు.
కొద్ది వారాల క్రితం చైనా ఇలాంటి ప్రయత్నమే
చేసినప్పుడు భారత్‌కు అమెరికా తోడుగా నిలిచింది. అరుణాచల్‌ను భారత్‌లో అంతర్భాగమేనని
గుర్తించింది. అప్పుడు అమెరికా వాదనను చైనా సైన్యం త్రోసిపుచ్చింది. భారత్‌తో తమ
వ్యవహారాలను తామే చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటామని, అమెరికా జోక్యం
అక్కరలేదనీ తేల్చి చెప్పింది.