తనపై ఎన్ని దాడులు చేసినా అవినీతిపై పోరాటం మాత్రం ఆపేది లేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. కొన్ని శక్తులు కూటమిగా ఏర్పడి అధికారం కోసం ఆరాటపడుతున్నాయని, దేశాన్ని అవినీతిపరుల నుంచి రక్షించేందుకు ఎన్నడూ వెనకడుగు వేసేది లేదని ప్రధాని మోదీ మీరఠ్ సభలో పునరుద్ఘాటించారు. అవినీతికి పాల్పడినవారు ఎంతటి పదవిలో ఉన్నా వదిలేదే లేదని మోదీ హెచ్చరించారు.
ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారని, అందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టులే నిదర్శనమంటూ ఇండీ కూటమి నాయకులు చేస్తున్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. దేశాన్ని అవినీతిపరుల నుంచి రక్షించేందుకు తాను పెద్ద యుద్ధమే చేస్తున్నట్లు ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అవినీతి గురించి మాట్లాడితే కొందరు ఉలిక్కిపడుతున్నారని ఇండీ కూటమి నేతలకు ప్రధాని మోదీ చురకలు వేశారు.
భారత్, శ్రీలంక మధ్య ఉన్న కచ్చతీవు దీవులు రక్షణ పరంగా ఏంతో కీలకం. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్వాకం వల్లే కచ్చ దీవులను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదని, వికసిత్ భారత్ కోసమని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.