Airport Ceiling Crashed
ఏప్రిల్ రాకముందే దక్షిణ భారతదేశంలో ఎండలు
మండిపోతున్నాయి. నడివేసివి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉక్కపోత, వడగాడ్పులు జనాన్ని
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈశాన్య భారతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా
ఉంది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు
ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపుతున్నారు.
ఆ వర్షాల తీవ్రతకు అస్సాం గౌహతి నగరంలోని
లోకప్రియ గోపీనాథ్ బొర్డొలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు పాక్షికంగా కుప్పకూలింది.
వర్షపునీరు మొత్తం లోనికి ప్రవహించింది.
భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్లనే పైకప్పు కూలిందని చీఫ్ ఎయిర్‌పోర్ట్
ఆఫీసర్ ఉత్పల్ బారువా చెప్పారు. వర్షపునీటిని బైటకు తీసుకెళ్లే పైపులు
పగిలిపోయాయని, నీరంతా సీలింగ్‌పై ప్రవహించిందని పేర్కొన్నారు. ఈ
ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదన్నారు. వెంటనే పైకప్పు మరమ్మతు పనులను చేపట్టారు.భారీ వర్షాలు, వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
కొన్నిటిని పాక్షికంగా మూసివేశారు. ఆరు విమానాలను దారి మళ్ళించారు. వర్షం తీవ్రత
తగ్గాకే, విమానాల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారు.