ఎన్నికల బాండ్ల వల్ల పారదర్శకత ఏర్పడుతుందని, ఎవరు ఎవరికి విరాళాలు ఇచ్చారో తెలిసిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం రాక ముందు ఇలాంటి విధానం ఉండేదికాదన్నారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం బీజేపీకి చెంపపెట్టులాందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు.
ప్రతి వ్యవస్థలో లోపాలుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. గతంలో ఏ పార్టీకి, ఎవరు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో తెలిసే అవకాశం ఉండేది కాదని, ఎన్నికల బాండ్ల వల్ల పారదర్శకత ఏర్పడిందన్నారు. నేను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదు. అలా చేసేవాడినైతే ఈశాన్య రాష్ట్రాల్లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసేవారిమా అని ప్రశ్నించారు. తమిళనాడులో తమ పార్టీకి వచ్చే ఓట్లు డీఎంకే వ్యతిరేక ఓట్లు కాదని, బీజేపీ అనుకూల ఓట్లని ప్రధాని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ సత్తాచాటుతుందన్నారు.