Koyil Alwar Tirumanjanam in Tirumala tomorrow
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం
81,224 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,093 మంది
తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.35 కోట్ల
రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సమకూరింది.
పిల్లల పరీక్షలు ముగుస్తుండడం, వేసవి సెలవులు
సమీపిస్తున్న తరుణంలో తిరుమలలో రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. సర్వదర్శనం
టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి
17 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దానికి అనుగుణంగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 9న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. శ్రీ
క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ
అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి
ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి
ఆలయంలో ఏప్రిల్ 2న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఆ రోజున అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆనందనిలయం మొదలు బంగారువాకిలి,
ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రి,
తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.
ప్రతీ యేడాదీ నాలుగుసార్లు… ఉగాది, ఆణివార
ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ
ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం
తిరుమలలో అనూచానంగా వస్తున్న ఆనవాయితీ. శుద్ధి తరువాత నామకోపు, శ్రీచూర్ణం,
కస్తూరి, పసుపు, కర్పూరం, గంధపు పొడి, కుంకుమ,
తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలంతో గుడి ఆవరణ అంతటినీ
ప్రోక్షణం చేస్తారు.
ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన
వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ చేసిసమర్పిస్తారు.
అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా రేపు మంగళవారం
వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలియజేసారు.
ఇక ఉగాది పర్వదినాన అంటే ఏప్రిల్ 9న ఉదయం 3
గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6
గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి
విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం
చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. తరువాత మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు
నూతన వస్త్రాలు ధరింపచేస్తారు. తరువాత పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది
ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు
శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పండుగ నాడు అంటే ఏప్రిల్ 9న ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను
టీటీడీ రద్దు చేసింది