ఏపీలో వాలంటీర్ల సేవలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పింఛన్లు సహా, అన్ని నగదు పంపిణీ వ్యవహారాలను ప్రభుత్వ ఉద్యోగులతో చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబులు డివైస్‌లు అన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని కూడా సీఈసీ సూచించింది.
వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ సిటిజన్ ఫోరమ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంజయ్‌కుమార్ ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలుంటాయని సీఈసీ హెచ్చరించింది.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వ ఉద్యోగులు, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే కేసులు నమోదు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.