గత 58 నెలలుగా వైసీపీ పాలనలో వివక్ష లేకుండా అర్హులకు ప్రభుత్వ
పథకాలు అందుతున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరిట కర్నూలు జిల్లాలో
పర్యటిస్తున్న జగన్, తుగ్గలిలో స్థానికులతో మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామన్న జగన్, టీడీపీ ప్రభుత్వం
హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం అని విమర్శించారు.
గత ప్రభుత్వానికి ప్రస్తుత
ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉంటున్న
విషయాన్ని గమనించాలన్నారు. ప్రతీరంగంలో.. ప్రతీ దశలోనూ మార్పు కనిపిస్తోందన్నారు. మంచి
కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని వైసీపీని గెలిపించాలని కోరారు.
తుగ్గలి, రాతన గ్రామల
పరిధిలో 10 వేల జనాభా ఉంటే 95 శాతం మందికి వైసీపీ పాలనలో మేలు జరిగిందన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామన్న జగన్ , విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు
రూ.2 కోట్లకు పైగా నిధులు అందజేశామన్నారు.
కాసేపట్లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర
అనంతపురంలో ప్రవేశించనుంది. సాయంత్రం ధర్మవరం నియోజకవర్గం పరిధిలో యాత్రకు విరామం
ప్రకటిస్తారు.