సీఎం జగన్మోహన్రెడ్డి విశ్వాస ఘాతుకానికి ట్రేడ్మార్క్ అంటూ ఏపీ బీజేపీ సీనియర్ నేత లంకా దినకర్ విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసి, అరాచక, విధ్వంసక పాలన చేసిన నరకాసురుడని విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దినకర్ నిప్పులు చెరిగారు. రావణుడు, దుర్యోధనుడు, నరకాసుడిని కలిపితే అది జగన్ అంటూ విమర్శించారు.రాక్షస పాలనకు శుభం కార్డు వేసేందుకు రాష్ట్రంలో ముగ్గురు త్రిమూర్తులు కలిశారని కూటమిని కొనియాడారు.
ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కు పోయింది. మరోసారి అవకాశం కల్పిస్తే ఇక రాష్ట్ర ప్రజలను ఎవరూ రక్షించలేరని దినకర్ ధ్వజమెత్తారు. రాజధానిని నిర్వీర్యం చేసి, మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్రెడ్డి మద్యం ద్వారా నెలకు 3 వేల కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాలా చేశాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.