సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన 79 వేల ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అందిన ఫిర్యాదుల వివరాలను మీడియాకు విడుదల చేశారు. సీ విజిల్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే 99 శాతం పరిష్కరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే 89 శాతం పరిష్కరించినట్లు గుర్తుచేశారు.
సీ విజిల్ ద్వారా అందుతోన్న కేసులో ముఖ్యంగా 73 శాతం అక్రమ బ్యానర్లు, హోర్డింగులకు సంబంధించినవి. ఇక మద్యం, బహుమతులు, డబ్బు పంపిణీకి సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి. ఆస్తుల ధ్వంసంకు సంబంధించిన ఫిర్యాదులు 2454, ఆయుధాలతో బెదిరించడం 535, నిషేధించిన సమయంలో ప్రచారం చేయడంలాంటివి వెయ్యికి పైగా ఫిర్యాదులు అందాయి.