గాజాలో హమాస్ తీవ్రవాదులతో పోరాడుతోన్న ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై భీకరదాడులకు దిగింది. శుక్రవారం ఇజ్రాయెల్ సిరియాపై జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది సిరియా సైనికులు చనిపోయారని, మొత్తం 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు మొదలయ్యాక సిరియాపై ఈ స్థాయిలో దాడులకు దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
2011లో సిరియాలో పౌరయుద్ధం మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఇజ్రాయెల్ వందల సంఖ్యలో వైమానిక దాడులు చేసింది. సిరియా సైన్యంతోపాటు, హిబ్జొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులకు సిరియా, ఇరాన్ నుంచి సాయం అందుతుండటంతో ఇజ్రాయెల్ తాజా దాడులకు దిగింది.
హిబ్జొల్లా ఉగ్రవాదులకు చెందిన ఆయుధాగారాలపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడి వందలాది పౌరులను ఊచకోత కోసిన తరవాత మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఇరాన్ అనుకూల వర్గాలు నడుపుతోన్న ఆయుధాల తయారీ పరిశ్రమలపై కూడా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు దిగింది.