2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని
కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది.
వైసీపీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్తవారికి టికెట్ కేటాయించింది. శ్రీకాకుళం
జిల్లాలో సీనియర్లను పక్కన పెట్టిన ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ యువ నేతలను బ్యాలెట్
ఫైట్ బరిలోకి దింపింది. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులను కాదంటూ కొత్తతరం నేతలతో
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది.
సుదీర్ఘ
రాజకీయ అనుభవం ఉన్న కిమిడి కళా వెంకటరావుకు ఆఖరి జాబితాలో చీపురిపల్లి టికెట్ కేటాయించింది.
ఆయనను వైసీపీ ముఖ్యనేత, మంత్రి బొత్స సత్యనారాయణపై పోటికి దింపింది. గుండు
లక్ష్మీదేవి, కలమట వెంకటరమణకు బదులు
టీడీపీ-జనసేన
మద్దతుతో బీజేపీ తరఫున ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు పోటీ చేస్తుండగా, టీడీపీ
టికెట్ పై శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, పాతపట్నం బరిలో ఎం. గోవిందరావు విజయమే
లక్ష్యంగా ప్రచారపర్వంలో చెమటోడుస్తున్నారు.
సిట్టింగ్
అభ్యర్థులనే బరిలోకి దించుతున్న పాలక వైసీపీ, ద్వితీయ శ్రేణి నేతల నుంచి తీవ్ర
అసమ్మతిని ఎదుర్కొవడం సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది.
అత్యంత
వెనుకడిన జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
ప్రతిపక్ష, అధికార పార్టీలకు చెందిన అనేక కుటుంబాలు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో క్రీయాశీలకంగా
వ్యవహరించాయి. కింజారపు, ధర్మాన, కిమిడి, బొడ్డేపల్లి, గుండ, కిలమట, గౌతు
కుటుంబాలు గడిచిన ఐదు దశబ్దాలుగా సిక్కోలు రాజకీయాలను శాసించాయి.
టీడీపీ
అగ్రనేత, కిమిడి కళావెంకటరావు, ఐదు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యారు. ఓ మారు రాజ్యసభకు
ప్రాతినిధ్యం వహించగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గాను పనిచేసిన
అనుభవం ఆయన సొంతం. ఆయన సోదరుడు కిమిడి గణపతిరావు ఓ మారు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా
ఆయన భార్య మృణాళిని మంత్రిగా, జడ్పీ చైర్ పర్సన్ గా సేవలందించారు.
ఎచ్చెర్ల
నియోజకవర్గంలో ఈ సారి తన సత్తా చాటేందుకు కాషాయపార్టీ తహతహలాడుతోంది. జనసేన,
టీడీపీ తో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు పోటీకి సిద్ధమయ్యారు. కళావెంకటరావు
అనుచరుడిగా టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈశ్వరరావు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన
కుటుంబానికి కూడా రాజకీయ చరిత్ర ఉంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ
అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
వెలమ
సామాజికవర్గానికి చెందిన గుండు అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం స్థానం నుంచి నాలుగు
సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యే గా పనిచేశారు.
ఎన్టీఆర్ ప్రభుత్వంలో కొద్దికాలం మంత్రి పదవి కూడా చేపట్టారు. 2004, 2009
ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో ఆయన
భార్య మహాలక్ష్మీ టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. ధర్మాన ప్రసాదరావు పై 2014లో గెలిచి, 2019లో
ఆమె
ఓడారు.
ఈ
దఫా గొండు శంకర్, సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు. శ్రీకాకుళం మండలం క్రిష్ణప్పపేట
సర్పంచ్ గా ఉన్న శంకర్, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పాతపట్నంలో
కూడా కొత్త ముఖాన్ని టీడీపీ బరిలో నిలిపింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన
కలమట మోహనరావు కుమారుడైన వెంకటరమణకు బదులు మామిడి గోవిందరావు ను పోటీకి దింపింది.
2009లో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన ఓడిన వెంకటరమణ, 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో
చేరారు. ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు పై పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2016లో వైసీపీని
వీడి టీడీపీలో చేరారు. 2019లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో పరాజయం
చెందారు.