UN responds on Arvind Kejriwal Arrest
‘ఎన్నికలు జరిగే అన్ని దేశాల్లో మాదిరిగానే భారతదేశంలో కూడా ప్రజల
రాజకీయ, పౌర హక్కులు రక్షించబడాలనీ, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలనీ
ఆశిస్తున్నట్లు’ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అధికార
ప్రతినిధి స్టెఫానే డుజారిక్ చెప్పారు.
గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు
జవాబిచ్చారు. భారతదేశంలో ఎన్నికలు జరగడానికి ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతోనూ,
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభించివేయడంతోనూన రాజకీయంగా ఆందోళనకర
పరిస్థితులు నెలకొన్నాయంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు డుజారిక్
స్పందించారు.
‘‘ఎన్నికలు జరిగే ఏ దేశంలో మాదిరిగానే భారతదేశంలో
కూడా ప్రతీ ఒక్కరి హక్కులూ రక్షించబడాలి. రాజకీయ, పౌర హక్కులు రక్షించబడాలి. ప్రతీ
ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోగలగాలి’’ అని ఆయన చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల
స్తంభన గురించి ఇదే తరహా ప్రశ్నకు అమెరికా స్పందించిన ఒక రోజు తర్వాత
ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది.
దేశంలో అంతర్గత పరిణామాల గురించి అమెరికా విదేశాంగశాఖ
ప్రతినిధి వ్యాఖ్యలు చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని
అమెరికా సీనియర్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో
తలదూర్చడం సరికాదంటూ తమ నిరసన వ్యక్తం చేసింది. అయినా గురువారం మళ్ళీ అమెరికా
అదేవిధమైన వ్యాఖ్యలు చేసింది.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలో అమెరికా
చేసిన వ్యాఖ్యలు అవాంఛితమైనవి, భారతదేశం తన ప్రజాస్వామిక వ్యవస్థల స్వతంత్ర వైఖరి పట్ల
గర్వంగా ఉంది. విదేశీ ప్రభావాల నుంచి దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి
భారత్ నిబద్ధతతో ఉంది’ అని భారత్ ప్రకటించింది.
‘దేశపు ఎన్నికల ప్రక్రియ, న్యాయ ప్రక్రియల్లో
బాహ్యశక్తులు చేసే తప్పుడు ఆరోపణలను భారత్ ఎంతమాత్రం ఆమోదించబోదు’ అని విదేశాంగశాఖ
స్పష్టంగా ప్రకటించింది. ఈ దేశపు చట్టాల ప్రకారమే ఈ దేశంలో న్యాయప్రక్రియ
కొనసాగుతుంది’ అని వెల్లడించింది.