Tejas Mk1A First Flight Successful
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన
తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకె1ఎ సీరీస్‌లో మొట్టమొదటి విమానం ఎల్ఎ5033 మొదటి
గగనవిహారం విజయవంతమైంది. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రంలో
గురువారం సాయంత్రం ఆ ప్రయోగం చేపట్టారు.
తేజస్ ఎంకె1ఎ ఎయిర్‌క్రాఫ్ట్ 18 నిమిషాల పాటు
గగనవీధిలో ఏ సమస్యలూ లేకుండా విజయవంతంగా విహరించింది. చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్
కెప్టెన్‌గా పదవీ విరమణ చేసిన కెకె వేణుగోపాల్ ఈ తేజస్ విమానం మొదటి గగన
విహారానికి పైలట్‌గా వ్యవహరించారు.
‘‘2021 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరిన తర్వాత
అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ వాతావరణం మారిపోయింది. దాంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది.
ఫలితంగా ఈ విమానం తయారీలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం. అయినా ముందు అనుకున్న
డిజైన్ ప్రకారమే హెచ్ఏఎల్ ఈ విమానాన్ని నిర్మించగలిగింది’’ అని హెచ్ఏఎల్ సీఎండీ
సిబి అనంతకృష్ణ వెల్లడించారు.
తేజస్ ఎంకె1ఎ విమానంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్
రాడార్, యుద్ధోపకరణాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మెరుగైన మెయింటెనెన్స్, అడిషనల్
కంబాట్ కేపబిలిటీ ఉన్నాయని హెచ్ఏఎల్ చెప్పుకొచ్చింది. ఈ విమానాన్ని భారత వాయుసేనలో
ఇక ఏ క్షణంలోనైనా చేర్చుకోవచ్చునని హెచ్ఏఎల్ ధ్రువీకరించింది. త్వరలోనే
పెద్దసంఖ్యలో ఈ విమానాలను ఉత్పత్తి చేస్తామని వివరించింది.