సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తప్పడం లేదు.ఆదాయపన్ను శాఖ చర్యలు నిలిపేయాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పిటిషన్ కోర్టు కొట్టివేయగానే ఆ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2017 నుంచి 2021 వరకు ఆదాయపన్ను, దానికి వడ్డీ, పెనాల్టీలు మొత్తం కలిపి రూ.1700 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపినట్లు ఆ పార్టీ నేత వివేక్ తంఖా మీడియాకు వెల్లడించారు.
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కనీసం ఆడిటింగ్ చేయకుండా నోటీసులు ఎలా జారీ చేస్తారని సీనియర్ నేత వివేక్ తంఖా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన సవాల్ విసిరారు.