దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ట
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైన నమోదు అవుతున్నాయి. సాధారణంతో
పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. తీవ్ర
వర్షాభావం, అధిక వేడి ఉండే ఎల్నినో పరిస్థితులు జూన్
వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు నెలలు
ఎండల తీవ్రత అధికంగానే ఉండనుంది.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో
భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు,
బావులు వట్టిపోయాయి. దిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
నమోదవుతున్నాయి.
అధిక
ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు.
కొన్ని
ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటంతో వ్యవసాయ, నిర్మాణ రంగ కార్మికులకు
ఇబ్బందికరంగా మారింది.
మధ్యాహ్నం బయట తిరగకుండా ఉంటే మంచిదని ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు
చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత మేర నీరు, మజ్జిగ తాగడం ద్వారా
శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వివరిస్తున్నారు.