యూపీకి చెందిన సీనియర్ రాజకీయ నేత, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ గుండెపోటుతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటంతో అతనిపై కేసు నమోదైంది. యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తోన్న అన్సారీ గురువారం రాత్రి 8 గంటల 25 నిమిషాలకు గుండెపోటుతో చనిపోయాడని అధికారులు ప్రకటించారు.
జైలులో అన్సారీకి తీవ్ర గుండెపోటు రావడంతో, వాంతులు చేసుకుని కోమాలోకి వెళ్లాడని డాక్టర్లు తెలిపారు. జైలు సిబ్బంది సమీపంలోని దుర్గావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించినా స్పందించలేదని తెలుస్తోంది. తరవాత అన్సారీ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
గ్యాంగ్‌స్టర్ అన్సారీపై మొత్తం 61 తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. అందులో 15 మర్డర్ కేసులున్నాయి. 1980లో ఓ గ్యాంగులో పనిచేసి, తరవాత 1990లో స్వయంగా ముఠాను ఏర్పాటు చేసుకున్న అన్సారీ కిడ్నాప్‌లు, హత్యలు చేయించడంలో ఆరితేరిపోయాడు. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కేసు నమోదైంది. 2004లో అతని వద్ద మెషీన్‌గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు రుజువు కావడంతో అన్సారీ జైలు జీవితం గడుపుతున్నాడు.