Tamil Parties fight with different symbols
ఉదయించే సూర్యుడు అధికార డీఎంకే గుర్తు.
రెండాకులు ప్రతిపక్షం అన్నాడీఎంకే గుర్తు. కానీ తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో
పాల్గొనడానికి చాలా పార్టీలే ఉన్నాయి. పైగా చాలామంది సీనియర్ నాయకులు స్వతంత్ర
గుర్తులతో పోటీ చేస్తున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు రకరకాల చిహ్నాలతో రాజకీయ
పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ పనీర్ సెల్వం
రామనాథపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా స్వతంత్ర చిహ్నంతో పోటీ చేస్తున్నారు.
ఎండీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శి దురై వైకో కూడా తిరుచ్చి నియోజకవర్గం నుంచి
స్వతంత్ర చిహ్నంతోనే బరిలోకి దిగుతున్నారు.
నమ్మ తమిళర్ కచ్చి (ఎన్‌టికె) పార్టీ చెరకురైతు
చిహ్నాన్ని పార్టీ గుర్తుగా పొందడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆ
పార్టీ తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ మైక్రోఫోన్ (మైక్) చిహ్నంతో రంగంలోకి
దిగుతోంది.
టిటివి దినకరన్ స్థాపించిన ఎఎంఎంకె పార్టీ ఈసారి
ఎన్నికల్లో ప్రెజర్ కుక్కర్ చిహ్నంతో పోటీ చేస్తోంది. ఆ గుర్తు దినకరన్‌కు గతంలో
బాగానే అచ్చొచ్చింది. జయలలిత మరణం తర్వాత భారీ రాజకీయ డ్రామా తర్వాత ఆర్కె నగర్
ఉపయెన్నిక జరిగింది. ఆ ఉపయెన్నికలో ఎఎంఎంకె పార్టీ తరఫున కుక్కర్ చిహ్నంతోనే పోటీ
చేసి టిటివి దినకరన్ గెలిచాడు.
ఇలా, గుర్తింపు లేని చిహ్నాలతో పోటీ చేయడం
ఎన్నికల అభ్యర్ధులకు తమ సామర్థ్యాన్ని చాటుకునే సందర్భం, అన్నాడీఎంకే నుంచి గెంటేసిన
పనీర్‌సెల్వం తనకు అన్నాడీఎంకే కార్యకర్తల మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నం
చేస్తున్నారు.
డిఎంకె మిత్రపక్షం, వైకో నాయకత్వంలోని ఎండిఎంకె తన
ఓట్లశాతాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. దానివల్ల రాబోయే ఎన్నికల సమయానికి
తనకు ప్రజల్లో గుర్తింపున్న చిహ్నం కావాలి. అందువల్ల తమకు కుళాయి గుర్తు
కేలాయించమని ఆ పార్టీ అడిగింది. అయితే ఒకే ఒక నియోజకవర్గంలో పోటీ చేసే పార్టీకి
దేశమంతా ఒకే చిహ్నం ఇవ్వడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం వెల్లడించింది. నిజానికి వారి
మిత్రపక్షమైన డీఎంకే తమ పార్టీ చిహ్నం మీదనే పోటీ చేయమని అడిగినా, ఎండీఎంకే సొంతచిహ్నం
మీద పోటీకే మొగ్గుచూపింది.
తమిళనాడులో ఎన్నికల సీజన్ వస్తే చాలు, ఎన్నికల చిహ్నాలు
సాధించడం పరువు ప్రతిష్ఠలతో ముడిపడి ఉన్న అంశం. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ చనిపోయాక
ఏఐఏడీఎంకే చీలిపోయింది. మాజీ భార్య, పిల్లలు ఒక వర్గం కాగా, జయలలిత మరో వర్గం
అయింది. ఆ సమయంలో రెండాకుల చిహ్నాన్ని కమిషన్ స్థంభింపజేసింది. తర్వాత జయలలిత
వర్గం ‘రెండు పావురాలు’ చిహ్నంతో పోటీ పడింది.