ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. గత వారం విధించిన వారం రోజుల కస్టడీ నేటితో ముగిసింది.మరో వారం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. న్యాయమూర్తి నాలుగు రోజుల కస్టడీకి అనుమతించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు న్యాయమూర్తికి వినిపించారు. తన పేరును నలుగురు నిందితులు ప్రస్తావించారని, అవి సాకుగా చూపి సీఎంను అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. తనను అవినీతి పరుడిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.
ఈ కేసులో నిందితులతో కలసి విచారించాల్సిన అవసరముందని ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ డిజిటర్ పరికరాల పాస్వర్డ్ చెప్పలేదని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చినప్పుడు మీడియాతో వ్యాఖ్యానించారు.