కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారంటూ 600 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇది పెద్ద చర్చకు దారితీసింది. న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా రాజకీయ నాయకులు కోర్టుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు ఆ లేఖలో వివరించారు.
స్వార్థ ప్రయోజనాల కోసం, వారి వ్యక్తిగత లబ్దికోసం రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకు వస్తున్నారంటూ న్యాయవాదులు, సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముందన్నారు. మీడియాతో మాట్లాడేప్పుడు న్యాయమూర్తులను కించపరిచే విధంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, తరవాత కోర్టులో సమర్థించుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.అనుకూల తీర్పులు రాకుండా బహిరంగ విమర్శలకు దిగుతున్నారని కూడా ప్రముఖ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో సీజేను కోరారు.