US continues to peep into India’s internal affairs
Uncle Sam acting as Peeping Tom
ప్రపంచానికి తానే పెద్దన్నను అనే అహంకారం తలనిండా
ఉన్న అమెరికా, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. మా వ్యవహారాల్లో
తలదూర్చవద్దు అని భారత్ హెచ్చరించినా, తలపొగరు తగ్గించుకోకుండా అదే పని
చేస్తామంటోంది.
ఢిల్లీలో మద్యం విధానం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంపై మొన్న మంగళవారం అమెరికా స్పందించింది. దానికి తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్, ఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు పంపింది. నిన్న బుధవారం
విదేశాంగ శాఖ కార్యాలయానికి హాజరైన అమెరికా ప్రతినిధికి భారత వ్యవహారాల్లో జోక్యం
చేసుకోవద్దంటూ హితవు పలికింది.
అయినా అమెరికా వైఖరిలో మార్పు రాలేదు. భారతదేశంలో
న్యాయప్రక్రియ నిజాయితీగా, పారదర్శకంగా, సమయబద్ధంగా సాగాలంటూ మళ్ళీ నోరు
పారేసుకుంది. కేజ్రీవాల్ అరెస్టు సహా భారత వ్యవహారాలన్నింటినీ నిశితంగా
పరిశీలిస్తుంటామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ బుధవారం మరోసారి
ప్రకటించారు.
కేజ్రీవాల్ వ్యవహారంపై రెండురోజుల క్రితం అమెరికా
చేసిన వ్యాఖ్యలకు స్పందనగా, నిన్న బుధవారం భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని అమెరికా
యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది. ఆ
మేరకు గ్లోరియా నిన్న సౌత్‌బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్ళారు.
సుమారు 40 నిమిషాల పాటు అక్కడ భారత విదేశాంగశాఖ అధికారులతో సమావేశమయ్యారు. భారత్
అమెరికా వ్యాఖ్యలపై తమ అభ్యంతరాలను ఆమెకు స్పష్టంగా వెల్లడించింది. అయినా, యుఎస్
తన వదరుబోతుతనాన్ని వదల్లేదు.
అమెరికా విదేశాంగశాఖ ప్రతినిథి మ్యాథ్యూ మిల్లర్ కేజ్రీవాల్
వ్యవహారంతో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభన విషయంలో కూడా స్పందించారు.
ఓ ప్రశ్నకు సమాధానంగా ‘‘కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల గురించి కూడా మాకు తెలుసు.
రాబోయే ఎన్నికల్లో వారి ప్రచారాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీకి చెందిన కొన్ని బ్యాంకు
ఖాతాలను స్తంభింపజేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది’’ అని మ్యాథ్యూ చెప్పుకొచ్చారు.
‘‘ఆంతరంగికంగా జరిగే దౌత్య చర్చల గురించి నేను
మీడియాకు చెప్పను. కానీ మేం ఇంతకుముందు బహిరంగంగా చెప్పిన విషయాలను మళ్ళీ
చెబుతాను. న్యాయప్రక్రియ నిజాయితీగా, పారదర్శకంగా, సమయబద్ధంగా జరగాలి. దానికి ఎవరూ
అభ్యంతరం చెబుతారనుకోను’’ అని మ్యాథ్యూ మీడియా ప్రశ్నలకు జవాబిచ్చారు.
కేజ్రీవాల్ అరెస్ట్ వంటి పరిణామాలను తాము
గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ మంగళవారం ప్రకటించడం ఈ వివాదానికి
దారితీసింది. అంతకుముందు జర్మనీ కూడా అటువంటి ప్రకటనే చేసింది. ఆ సందర్భాల్లో
భారత్ తన అభ్యంతరాలను ప్రకటించింది.
‘‘ఒక దేశపు సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాల
విషయంలో ఇతర దేశాలు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ప్రత్యేకించి, ప్రజాస్వామ్య
దేశాలు అలాంటి సందర్భాల్లో మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. లేనిపక్షంలో ప్రపంచదేశాల
సంబంధాలు దెబ్బతినవచ్చు’’ అని భారత్ స్పందించింది.