దేశంలో
బీజేపీ హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విడతల వారీగా లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా
కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో లోక్‌సభతో
పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ తన ఆధిపత్యాన్ని
మరోసారి ప్రదర్శించింది.
ఏప్రిల్ 19న
తొలిదశలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన
నామినేషన్ ప్రక్రియ మార్చి 27తో
ముగిసింది. మొత్తం 60 అసెంబ్లీస్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్
లో ఆరు చోట్లు కేవలం బీజేపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో
వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల
పరిశీలన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు.
ముఖ్యమంత్రి
పెమా ఖండూ పోటీలో ఉన్న నియోజకవర్గం సహా మరో ఐదు స్థానాల్లో ఇతర పార్టీల నేతలు
నామినేషన్ వేయలేదు.
పెమా
ఖండూ ముక్తో అసెంబ్లీ నుంచి పోటీకి దిగారు. పెమా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణం
తర్వాత కాంగ్రెస్ నుంచి 2011 ఉప-ఎన్నికల్లో ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు. 2014లో కూడా ఆయన మళ్లీ కాంగ్రెస్ టికెట్‌పై
పోటీ లేకుండా గెలుపొందారు. అయితే, ఖండూ
2016లో బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి
థుప్టేన్ కున్పెన్పై ఘన విజయం సాధించారు.
ఇటీవల
బీజేపీలో చేరిన పాణి తారామ్.. 2014
ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి. కోరియాంగ్ నుంచి గెలిచి
ఆ తర్వాత ఎన్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన లోకం తాసర్ చేతిలో
ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఎన్నిక కోరియాంగ్లో ఏకగ్రీవమైంది.
రోయింగ్
అసెంబ్లీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే ముచ్చు మిఠి, తాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జిక్కే టేక్, తాలిహా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే
న్యాటో రిగియా, సగాలిలో రతు టేచీలు పోటీలో ఉండగా..
ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు.
2019 ఎన్నికల్లో బీజేపీ 41, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి.