Kerala CM lies on Bharat Mata are exposed
దేశాన్ని తల్లిగా కొలిచే ఉదాత్త భావనను, జాతీయతావాదాన్ని
తీవ్రంగా వ్యతిరేకించడంలో భారతీయ కమ్యూనిస్టులు ముందువరుసలో ఉంటారు. ప్రజలెవరికీ
తమ దేశమంటే భక్తి ఉండకూడదని, అది స్వార్థానికి చిహ్నమనీ గాలికబుర్లు చెప్పే
కమ్యూనిస్టుల ప్రచారాన్ని నమ్మేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. దాంతో
ఎర్రపార్టీలు ఇప్పుడు కొత్తబాట పట్టాయి. జాతీయవాద భావనలను ఆదరించే సంస్థలపై కొత్తతరహా
దుష్ప్రచారం మొదలుపెట్టాయి. ఆ క్రమంలో వారాడే అబద్ధాల గురించి అందరికీ ఇట్టే తెలిసిపోతోంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సోమవారం (25
మార్చి) పౌరసత్వ సవరణ చట్టం ‘సీఏఏ’ అమలుకు వ్యతిరేకంగా మలప్పురం జిల్లాలో ఓ
బహిరంగసభలో పాల్గొన్నారు. సీఏఏ ముస్లిములకు వ్యతిరేకమనీ, వారి పౌరసత్వాన్ని
తొలగించివేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ప్రచారం
చేయడం వారి ఉద్దేశం. ఆ క్రమంలో భారతమాత గురించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.
‘‘సంఘ్ పరివార్ కార్యక్రమాల్లో ‘భారత్‌మాతా కీ జై’
అని నినాదాలు చేయడం మనం చూస్తుంటాం. ఆ నినాదానికి రూపకల్పన చేసింది ఎవరో తెలుసా?
ఎవరైనా సంఘ్ పరివార్ నాయకుడా? నిజానికి ఆ విషయం సంఘ్‌పరివార్‌కు తెలుసో లేదో కూడా
తెలీదు. అతని పేరు అసీముల్లా ఖాన్. అతను 19వ శతాబ్దానికి చెందినవాడు. మరాఠా పీష్వా
నానాసాహెబ్ ప్రధానమంత్రిగా ఉండేవాడు. భారత్‌మాతా కీ జై అనే నినాదాన్ని
తయారుచేసింది అతడే. ఒక ముస్లిం భారతమాతకు జై అంటూ నినాదాన్ని రూపొందించాడు కాబట్టి
దాన్ని పలకడం ఆపేయాలని సంఘ్ పరివార్ నినదిస్తుందేమో నాకు తెలీదు’’ అని పినరయి
విజయన్ వ్యంగ్యం వెళ్ళబోసారు.
‘‘అంతేకాదు, జైహింద్ అనే నినాదాన్ని
మొట్టమొదటిసారి ఉపయోగించింది, వాడుకలోకి తెచ్చింది కూడా ఒక ముసల్మానే. అబిద్ హసన్
అనే మాజీ దౌత్యవేత్త జైహింద్ అని నినదించిన మొదటివ్యక్తి. ఇప్పుడు సంఘ్‌కు నా
ప్రశ్న ఒకటే… ముస్లిములు ఈ దేశాన్ని వదిలిపెట్టేయాలి, వాళ్ళను పాకిస్తాన్
పంపించేయాలి అని చెప్పే సంఘ్ పరివార్ ఈ చరిత్రను అర్ధం చేసుకోవాలి’’అని పినరయి
చెప్పుకొచ్చారు.
ఈ నెల మొదట్లో భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ
చట్టాన్ని పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తెచ్చింది. సీఏఏను ఆమోదించని ముస్లిములు
భారత్ వదిలివెళ్ళిపోవాలంటూ ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు రెచ్చిపోతున్నాయని కమ్యూనిస్టు
పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానిజాలతో సంబంధం లేకుండా హిందూ ముస్లిముల
మధ్య విద్వేషాగ్ని రగల్చడమే వాటి ధ్యేయం. ఆ అజెండానే విజయన్ అమలు చేసారు.
ముస్లిములు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలంటూ సంఘ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయనే
అబద్ధాన్ని విజయన్ మరోసారి తకెర మీదకు తెచ్చారు.
అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి. భారతమాత అన్న పదాన్ని
మొదటిసారి వాడింది 1866లో. భూదేవ్ ముఖోపాధ్యాయ అనే వ్యక్తి ‘ఉనబింగ్ష పురాణ’ అనే
తన వ్యంగ్య రచనలో మొదటిసారి భారతమాత అనే పదాన్ని ప్రయోగించాడు. తర్వాత మళ్ళీ
1873లో కిరణ్ చంద్ర బెనర్జీ అనే వ్యక్తి తను రచించిన నాటకంలో ఉపయోగించాడు. ఆ మేరకు
పలు చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి.
ఇంకో విషయమేంటంటే ఆరెస్సెస్ ముస్లింలకు వ్యతిరేకం
కాదు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారు ఎవరైనా సరే, వారిని దేశం నుంచి
వెళ్ళగొట్టాలన్నది సంఘ్ సిద్ధాంతం. అంతేతప్ప గంపగుత్తగా ముస్లిములను దేశంనుంచి బహిష్కరించాలనే
పిచ్చివాదనలు సంఘ్ కానీ, దాని అనుబంధ సంస్థలు కానీ ఏనాడూ చేయలేదు, చేయబోవు.
మరోవిషయం… శివాజీని, అతని వారసులను, అతని
బలగాలను బహుళ సంస్కృతుల సమ్మేళనంగా చూపించాలనే ప్రయత్నాలు కమ్యూనిస్టులు చాలాకాలం
నుంచీ చేస్తున్న కుట్రలు. వారు ఛత్రపతి శివాజీ మన దేశానికి చేసిన సేవలను తక్కువ
చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. అతన్ని చిట్టెలుక అని అవమానిస్తూ ఔరంగజేబు
సామ్రాజ్యానికి చిన్న ఇబ్బంది మాత్రమే అని తక్కువగా మాట్లాడతారు. ఆ ప్రయత్నాలు
విఫలమైనప్పుడు అతని సైన్యంలోనూ కొద్దిమంది ముస్లిం సేనానాయకులు ఉండేవారని తప్పనిసరి
పరిస్థితుల్లో ఒప్పుకుంటారు.
పినరయి విజయన్ చేసిన దురుద్దేశపూర్వక దుష్ప్రచారంపై
బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయన్ కనీసం ఒక్కసారయినా ‘భారత్‌మాతా కీ
జై’ అని మనస్ఫూర్తిగా నినదించారా అని కేరళ బీజేపీ అధికార ప్రతినిధి సందీప్
వాచస్పతి ప్రశ్నించారు. పినరయి విజయన్, అతని పార్టీ భారతదేశాన్ని తల్లిగా
గుర్తిస్తారా? అసీముల్లా ఖాన్‌కు ప్రేరణగా నిలిచిన మహర్షి దయానంద సరస్వతి, ఆయన
స్థాపించిన ఆర్యసమాజాన్ని వారు గౌరవిస్తారా? ముస్లిముల పట్ల తన ప్రేమకు
నిదర్శనంగానైనా పినరయి తన జీవితకాలంలో ఒక్కసారైనా ‘భారత్‌మాతా కీ జై’ అంటారా? అసీముల్లాఖాన్
ఏ స్ఫూర్తితో ఆ నినాదం ఇచ్చాడో ఆ స్ఫూర్తిని గుర్తించే ధైర్యం పినరయి విజయన్ చూపగలరా?
అంటూ ప్రశ్నలు సంధించారు.
భారత్‌మాతా కీ జై అనే నినాదాన్ని ఒక ముస్లిం
ఇచ్చిఉన్నా, అలాంటి దేశభక్త నినాదాలను, గీతాలనూ అందరూ సొంతం చేసుకోవాలి, దానికి
మతపరమైన లేదా రాజకీయ పరమైన వివక్షలు పెట్టుకోనక్కరలేదు అని వాచస్పతి స్పష్టం చేసారు.
ముస్లిముల
దేశభక్తి గురించి బీజేపీ ఎలాంటి అనుమానాలూ లేవనెత్తలేదనీ, దేశ స్వాతంత్ర్య
పోరాటంలో హిందువులు, ముస్లిములు కలిసే పాల్గొన్నారనీ ఆయన గుర్తు చేసారు. మాతృదేశం
పట్ల ప్రేమ మత పరిధులకు లోబడినది కాదనీ, అది ప్రతీ భారతీయుడి ప్రాథమిక బాధ్యత అని
వాచస్పతి వ్యాఖ్యానించారు