Madras Music Academy Controversy Continues
టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత
కళానిధి పురస్కారం ప్రకటించడంతో తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదంలో తలదూర్చిన
‘ది హిందూ’ పత్రిక సంపాదకుడు ఎన్ రామ్, గాయనీమణులు రంజని-గాయత్రిలను కుల
దురభిమానులుగా వ్యాఖ్యానించారు. ఇక, మ్యూజిక్ అకాడెమీ అధ్యక్షుడు ఎన్ మురళి లేఖకు
స్పందించిన రంజని-గాయత్రి ద్వయం, అకాడెమీ పదవికి రాజీనామా చేసి బ్రాహ్మణేతరులకు
అవకాశం కల్పించమని సూచించారు.
త్యాగరాజస్వామిని-ఎంఎస్ సుబ్బులక్ష్మిని-మొత్తంగా
కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నే అవహేళన చేసిన, హిందూ వ్యతిరేక భావజాలం కలిగి ఉన్న,
పెరియార్ అనుయాయి టిఎం కృష్ణకు 2024 సంగీత కళానిధి అవార్డు ప్రకటించడం తమిళనాట
సంచలనమే సృష్టించింది. ఆ నిర్ణయంతో పలువురు సంగీతకళాకారులు ఈ యేడాది డిసెంబర్లో
జరగబోయే మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వార్షిక ఉత్సవాల నుంచి తప్పుకున్నారు. టిఎం కృష్ణకు
పురస్కారం ప్రకటించడం తమకు నచ్చనందువల్ల అకాడెమీ కార్యక్రమాల్లో పాల్గొనబోమని
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు చాలామంది ప్రకటించారు. వారిలో రంజని-గాయత్రి
అనే గాయనీమణుల జంట మొదటివారు. దాంతో వారిని నిందిస్తూ అకాడెమీ అధ్యక్షుడు ఎన్
మురళి బహిరంగలేఖ రాసారు.
‘‘మీ లేఖలోని దూషణలు, గౌరవప్రదుడైన సహ
విద్వాంసుడి పట్ల దుర్మార్గమైన ఆరోపణలూ చూసి దిగ్భ్రాంతి చెందాను. మీ లేఖలో
అవాంఛితమైన అభాండాలు, దుర్మార్గపు ఆరోపణలూ మీ తోటి సీనియర్ కళాకారుడి ప్రతిష్ఠకు
భంగం కలిగించేలా ఉన్నాయి’’ అంటూ రంజని-గాయత్రిలపై మురళి ఆరోపణలు చేసారు.
‘‘మ్యూజిక్ అకాడెమీ 1942లో ప్రారంభించిన సంగీత
కళానిధి అవార్డు కర్ణాటక సంగీతంలో శిఖరాయమానమైన పురస్కారం. ఆ అవార్డును ఎవరికి
ప్రదానం చేయాలన్నది మ్యూజిక్ అకాడెమీ విశిష్ట అధికారం. ఆ ఎంపికకు అకాడెమీ ఎన్నో జాగ్రత్తలు
తీసుకుంటుంది. తమ కళాజీవితంలో ఉత్కృష్టమైన స్థాయికి చేరుకుని, సంగీతపరంగా
అద్భుతమైన ప్రతిభ కనబరచడం ఒక్కటే ప్రాతిపదికగా ఆ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ
యేడాది కూడా అకాడెమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ టిఎం కృష్ణను అదేవిధంగా ఎంపిక చేసింది.
సుదీర్ఘకాలం నుంచి సంగీతరంగంలో ఆయన చేసిన కృషి తప్ప, మరే బాహ్య కారణాలూ ఆయన ఎంపికను
ప్రభావితం చేయలేదు’’ అని మురళి చెప్పుకొచ్చారు.
‘‘మీకు నచ్చని విద్వాంసుడికి అకాడెమీ అవార్డు
ప్రకటించడమే ఈ యేడాది వార్షిక కార్యక్రమం నుంచి మీరు ఉపసంహరించుకోడానికి కారణమని
భావిస్తున్నాము. అయితే ఆ విద్వాంసుణ్ణి అనర్హుడిగా అపఖ్యాతిపాలు చేయడం మాత్రం
బాగోలేదు. మీరు నాకు, అకాడెమీకి రాసిన లేఖను సోషల్ మీడియాలోనూ షేర్ చేయడం అమర్యాద
మాత్రమే కాదు, మీ లేఖ వెనుక ఉద్దేశాలు, మీరు ఆశిస్తున్న ప్రయోజనాల గురించి
అనుమానాలు కలగజేస్తోంది. అలాంటి మీ దుడుకు ప్రవర్తనకు స్పందించనవసరం లేదు. కానీ
కర్ణాటక సంగీత రంగానికి మీరు చేసిన సేవలను గుర్తిస్తూ మీకు జవాబిస్తున్నాను’’ అంటూ
మురళి రాసుకొచ్చారు.
రంజని-గాయత్రి ఏదో భారీ నేరం చేసినట్లు,
దురుద్దేశపూరితంగా వ్యాఖ్యలు చేసిన ఆ గాయనీమణులపై పరువునష్టం దావా వేసే
అవకాశమున్నా దయతలచి వదిలేస్తున్నట్లూ మ్యూజిక్ అకాడెమీ ఎన్ మురళి వారికి లేఖ రాసి
దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఈ కథ అక్కడితో ఆగలేదు. ఎన్ మురళి సోదరుడు,
ప్రఖ్యాతి హిందూ వ్యతిరేక ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ సంపాదకుడు ఎన్ రామ్ ఈ వ్యవహారంలో
తలదూర్చారు. టిఎం కృష్ణకు పురస్కారం ప్రకటించడంతో ఆవేదన చెంది ఈ యేడాది చాలామంది
కళాకారులు అకాడెమీ వార్షికోత్సవాల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకోవడం పాపం ఆయనకు
చాలా ఆవేదన కలిగించింది. వెంటనే ‘వాస్తవాల పరిశీలన’ పేరుతో తన ఎక్స్ ఖాతాలో టి.ఎం
కృష్ణ గతంలో రాసిన వ్యాసాన్ని షేర్ చేసారు. అందులో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని కృష్ణ
ఎక్కడా అవమానించలేదని తేల్చేసారు. పనిలో పనిగా ఇప్పుడు అకాడెమీ కార్యక్రమాలకు
హాజరుకాబోమన్న కళాకారులను ‘కుల దురహంకారులు’ అని ముద్ర వేసేసారు. ‘‘టిఎం కృష్ణను,
అతనికి 2024 సంగీత కళానిధి పురస్కారం ప్రకటించిన మ్యూజిక్ అకాడెమీని లక్ష్యం
చేసుకున్నది కుల దురహంకార ముఠా’’ అని వ్యాఖ్యానించేసారు. అక్కడితో ఆగలేదు. ‘‘హిందుత్వ
ప్రచారం చేస్తున్న ఏ తప్పుడు సమాచారాన్ని ఆ సంగీతవేత్తల చిన్న ముఠా చదువుతోంది’’
అంటూ… పరోక్షంగా వారిపై బీజేపీ ముద్ర వేసేసారు. ఒక పత్రికా సంపాదకుడిగా, తాను
ఎవరిపైన అయినా తీర్పులు చెప్పేయవచ్చు అనే దురహంకారంతో వ్యవహరించేవారిలా, ఆ సంగీత
కళాకారులపై కుల దురహంకారులు, హిందుత్వ కోటరీ అంటూ ముద్రలు అద్దారు.
అన్నాదమ్ములు ఇద్దరూ చేసిన వ్యాఖ్యలకు
రంజని-గాయత్రి తీవ్రంగా స్పందించారు. తమపై వేసిన ‘కుల దురభిమాన కోటరీ’ ముద్రకు జవాబిచ్చారు.
మ్యూజిక్ అకాడెమీ అధ్యక్షుడు ఎన్ మురళికి మరో లేఖ రాసారు. కర్ణాటక సంగీతాన్ని
బ్రాహ్మణుల చెర నుంచి విడిపించే ప్రయత్నం ముందుగా అకాడెమీ నుంచి మొదలుపెట్టాలనీ, బ్రాహ్మణులైన
మురళి, ఇతర సభ్యులు మ్యూజిక్ అకాడెమీ పదవులకు రాజీనామా చేసి బ్రాహ్మణేతరులకు ఆ
పదవులు కట్టబెట్టాలని హితవు పలికారు.
‘‘మా లేఖకు దయతో స్పందించినందుకు ధన్యవాదాలు. ఒక
విషయం స్పష్టం చేయదలచుకున్నాము. మేము అకాడెమీ వార్షిక సదస్సులో పాల్గొనబోవడం లేదు
అని మీకు ఆ లేఖలో సమాచారం ఇచ్చాము తప్ప మీ నిర్ణయాల గురించో లేక చర్యల గురించో
అభ్యర్ధించలేదు. మేము ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అకాడెమీ కార్యక్రమంలో
మేము పాల్గొనడం లేదు అన్న సమాచారాన్ని మా అభిమానులకు తెలియజేసాం, అంతే. దానివల్ల, మీ
స్వీయ సమర్థనకు ఇబ్బంది కలిగిందని అర్ధమైంది, దానికి చింతిస్తున్నాం.
మీరు అవార్డు ఎవరికి ఇవ్వాలన్న మీ అధికారాన్ని మేం
ప్రశ్నించామా? లేదు.
కార్యక్రమం నుంచి ఉపసంహరించుకోడానికి మాకున్న
అధికారాన్ని ఉపయోగించుకున్నామా? అవును.
ఒక జాతిని చంపేయమని పిలుపునిచ్చినవారికి, బూతులు
తిట్టినవారికి సమర్థకులుగా ఉండడానికి వ్యతిరేకించామా? అవును.
మేము అసలు అడగనే అడగని ప్రశ్నలకు చక్కటి పదజాలంతో
జవాబివ్వడం ద్వారా మీకు అనుకూలమైన వాదనను నిర్మించుకునేందుకు, మాకు లేని ఉద్దేశాలు
ఆపాదించేందుకూ మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రెస్‌కు మీరిచ్చిన ప్రకటనలు నిజాయితీ
లేనివి, అనైతికమైనవి.
మీ లేఖ మాకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అది మీ
స్పందనలా కాక, పురస్కార గ్రహీత తరఫున విడుదల చేసినట్లుగా ఉంది. అతనికీ, మ్యూజిక్
అకాడెమీకీ ఉన్న తేడాను చెరిపేసేలా ఉంది. కానీ మాపై ‘కుల దురహంకార ముఠా’ అన్న ముద్ర
వేస్తూ ఈ వ్యవహారంలోకి అప్రకటిత అధికార ప్రతినిధిగా మీడియా పెత్తందారు ఎన్ రామ్
తలదూర్చిడంతో మా ఆశ్చర్యం తొలగిపోయింది.
ఈ పూజనీయమైన సంస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. సమాజంలో
వెనుకబడిన కులాల నుంచి అద్భుతమైన కళాకారులు వచ్చి ఈ వేదికపై ఆధిపత్యాన్ని
ప్రకటించడాన్ని చూసేరోజు మాకూ, మాతోపాటు లక్షలాది మందికీ ఎంతో ఆనందదాయకమైన రోజు
అవుతుంది. అన్ని కులాలు, మతాల ప్రజలతో కూడిన వైవిధ్యభరితమైన శ్రోతలతో టీటీకే
ఆడిటోరియం నిండిపోయే రోజును చూడాలనుకుంటున్నాం.
ఆ మార్పు అగ్రస్థానం నుంచే మొదలవ్వాలి. రెండు
దశాబ్దాలుగా మీరు కూర్చుని ఉన్న సింహాసనం నుంచే, ఇన్నాళ్ళుగా పాతుకునిపోయి ఉన్న
కేవలం బ్రాహ్మణులతో నిండి ఉన్న అకాడెమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచే ఆ మార్పు
మొదలుపెట్టండి. కళాకారులు తమ ప్రతిభను చూపడానికి ఎంతో శ్రమపడాలి, సుదీర్ఘకాలం సంగీత
ప్రయాణం చేయాలి. కానీ ఈ మార్పు వెంటనే సాధించవచ్చు. ఒక సాదా తీర్మానం, కొన్ని
రాజీనామాలు సరిపోతాయి.
కాబట్టి, మీరే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే
అవకాశాన్ని పరిగణించండి. మీరు చెప్పేవి నోటి చివరి కబుర్లు మాత్రమే అనే అవకాశం
ప్రపంచానికి ఇవ్వకండి. కులం గురించి మూర్ఖపు పట్టుదల ఉన్న దురహంకారుల ముఠా అని మీమీద
ముద్ర వేసే అవకాశం సమాజానికి ఇవ్వకండి’’
తమపై కుల దురహంకార ముఠా రంజని-గాయత్రి
తమ లేఖలో మ్యూజిక్ అకాడెమీ అధ్యక్షుడు ఎన్ మురళికి, ఆయన సోదరుడు, ‘హిందూ’ పత్రిక
సంపాదకుడు ఎన్ రామ్‌కు ఒకేసారి జవాబిచ్చేసారు. అయితే ఎన్ మురళి కానీ, ఎన్ రామ్
కానీ వారి సూచనను అమల్లో పెట్టే అవకాశాలు ఏమాత్రం లేవు. కానీ ఈ వివాదం ఇక్కడితో
ఆగే సూచనలు కనిపించడం లేదు.