Rae Bareli MLA on Priyanka Gandhi’s offer to her ex-husband
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మిగిలిన ఒకేఒక లోక్‌సభా
స్థానం రాయబరేలీ. ఆ సీటు నుంచి ఎంపీగా గెలిచిన సోనియాగాంధీ ఇప్పుడు రాజ్యసభకు
మారిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. రాయబరేలీ
లోక్‌సభ పరిధిలోకి వచ్చే రాయబరేలీ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నది
అదితీ సింగ్. ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌లోని అగ్రకుటుంబంపై దారుణమైన ఆరోపణలు చేసారు.
తన ప్రవర్తన గురించి చెడుగా ప్రచారం చేస్తే తన మాజీ భర్తకు కాంగ్రెస్ టికెట్
ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీవాద్రా చెప్పారట. కంగనా రనౌత్
మీద కాంగ్రెస్ నాయకుల చెడు వ్యాఖ్యల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే అదితి చేసిన
ఆరోపణ ప్రాధాన్యం సంతరించుకుంది.
అదితీ సింగ్ 2017లో రాయబరేలీ సదర్ నియోజకవర్గం
నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2021 నవంబర్‌లో ఆమె బీజేపీలో
చేరారు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా విజయం
సాధించారు. గతవారం ఒక జాతీయ మీడియా ప్రతినిధితో ముఖాముఖిలో మాట్లాడిన అదితీ సింగ్,
ప్రియాంకాగాంధీవాద్రాపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. ‘‘దురదృష్టవశాత్తు నేను నా
భర్తతో విడిపోయాను. ఇక టికెట్ల పంపిణీ సమయంలో ప్రియాంక నా మాజీ భర్తకు ఏం చెప్పారంటే….
అదితి గురించి చెడుగా ప్రచారం చెయ్యి, ఆమె ప్రవర్తన మంచిది కాదని చాటిచెప్పు’’ అని
అదితి చెప్పుకొచ్చారు.
అదితి తండ్రి అఖిలేష్ సింగ్ రాయబరేలీ సదర్
నియోజకవర్గం నుంచి 1993 నుంచి 2007 వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2007లో
ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. 2012లో పీస్ పార్టీ ఆఫ్ ఇండియా టికెట్ మీద
పోటీ చేసారు. అలా 2017వరకూ ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017 నుంచీ ఆ స్థానానికి అదితీ
సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అదితీ సింగ్ మొదటినుంచీ స్వతంత్రభావాలు కలిగిన
యువతి. 2017లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచినప్పటికీ, పలు సందర్భాల్లో పార్టీ
నిర్ణయాలను ఆమె బహిరంగంగానే విమర్శించేవారు. 2019లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
ఏర్పాటు చేసిన ప్రత్యేక శాసనసభ సమావేశాలకు హాజరు కావద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినా,
ఆమె వినలేదు. దాంతో అదితిని ప్రజాప్రతినిధిగా అనర్హురాలిగా ప్రకటించాలంటూ
కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
అప్పటికి అదితి, ఆమె భర్త అంగద్ సైనీ విడిపోలేదు.
అంగద్ 2017లో పంజాబ్‌లోని నవాషహర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా
ఉండేవారు. 2019లో అదితి స్వతంత్రస్వరం తర్వాత, కాంగ్రెస్ వైఖరి మారింది. 2022 పంజాబ్
శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ
కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. కానీ
ఓడిపోయారు. అప్పట్లో అంగద్ సైనీ తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోడాన్ని గురించి బహిరంగంగానే
విమర్శలు చేసారు. తనకు టికెట్ ఇవ్వకపోడానికి కారణం ఎమ్మెల్యేగా తన పనితీరు కాదనీ,
తన భార్యకు సంబంధించిన కారణాలతోనే తనకు టికెట్ నిరాకరించారనీ బహిరంగంగానే చెప్పుకొచ్చారు.
మరికొన్ని నెలలకే, అంటే 2022 మేలోనే అంగద్ సైనీ మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు.
అదితి, అంగద్‌లు గతేడాదే వ్యక్తిగత కారణాల వల్ల
విడాకులు తీసుకున్నారు. వారు విడిపోవడాని కంటె ముందే, అదితి గురించి చెడుగా
మాట్లాడితేనే టికెట్ దక్కుతుందంటూ ఆమె భర్తకు ప్రియాంకాగాంధీ చెప్పారని ఆమె ఆరోపణ.
అదే నిజమైతే, సాటి మహిళ పట్ల ప్రియాంకాగాంధీ వైఖరి, కాంగ్రెస్ ప్రవర్తన ఎలా
ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
రాబోయే లోక్‌సభ
ఎన్నికల్లో నటి కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు
అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారు. కానీ, అలా మహిళలను కించపరుస్తూ ప్రవర్తించడం
వారికి మొదటి నుంచీ అలవాటయిన విషయమేనని అదితీసింగ్ ఉదంతంతో అర్ధమవుతోంది.