ఏపీ
అభివృద్ధికి బీజేపీ అంకితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి
అన్నారు. ఎన్డీయేలోని మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనన్నారు. ఎన్డీయే
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రామరాజ్యం వస్తుందని అభిలాషించారు.
వైసీపీ
ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేసేందుకే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య
పొత్తు కుదిరింది అన్నారు. మూడుపార్టీల
కలయికను ఆమె త్రివేణి సంగమంగా అభివర్ణించారు.
విజయవాడ
వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంఈ
సమావేశంలో పురంధేశ్వరితో పాటు పార్టీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ తో
పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
పొత్తుల
కారణంగా చాలా మంది ఆశావహులకు అవకాశం దక్కలేదన్న పురందరేశ్వరి, రాష్ట్రంలోని రాజకీయ
పరిణామాల దృష్ట్యా కూటమిలో చేరడం అవసరమని
హైకమాండ్ నిర్ణయించిందన్నారు.
వైసీపీ
ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించిన పురందరేశ్వరి, భారీ
ఎత్తును అప్పులు చేయడంతో పాటు దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు.
మహిళల
పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని
మండిపడిన పురందరేశ్వరి, ‘‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే’’ అని సంబోధించే జగన్ వారికి
ఏం న్యాయం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన
ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు. ఎస్సీలకు
జగన్ చేసిన న్యాయం ఇదేనా అని దుయ్యబట్టారు.