ISRO’s POEM-3 mission makes debris-free earth re-entry
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత
సాధించింది. పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మోడ్యూల్-3 (పొయెమ్-3) రోదసిలో
ఎలాంటి వ్యర్థాలూ వదలకుండా భూవాతావరణంలోకి ప్రవేశించింది. అంతరిక్ష పరిశోధనల్లో
ఇది మరొక మైలురాయి అని ఇస్రో వెల్లడించింది.
‘‘పీఎస్ఎల్వీ-సీ58/ఎక్స్‌పోశాట్ మిషన్ తన రోదసీ
కక్ష్యలో ఎలాంటి వ్యర్థాలనూ వదిలిపెట్టలేదు’’ అని ఇస్రో ప్రకటించింది.
పీఎస్ఎల్వీ-సీ58ను 2024 జనవరి 1న ఇస్రో
విజయవంతంగా ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా పలు ఉపగ్రహాలను వాటి నిర్ణీత కక్ష్యల్లోకి
ప్రవేశపెట్టింది. ఆ లక్ష్యాలు పూర్తయిన తర్వాత ఆ లాంచింగ్ వెహికిల్, త్రీ-యాక్సెస్
స్టెబిలైజ్డ్ ప్లాట్‌ఫాంగా రూపాంతరం చెందింది. దాన్నే పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్
మోడ్యూల్-3గా (పీఓఈఎం-3) వ్యవహరిస్తున్నారు.
ఉపగ్రహాలను రోదసిలో నిర్ణీత కక్ష్యలలో ప్రవేశపెట్టిన
పొయెమ్-3 మోడ్యూల్ తిరిగి భూమ్మీదకు రావాలి. ఆ క్రమంలో దాని కక్ష్యను 650
కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకు మార్చారు. దానివల్ల భూవాతావరణంలోకి రావడం
వేగవంతమయింది. దాన్నుంచి రెసిడ్యుయల్ ప్రొపెల్లెంట్స్‌ను తొలగించడం ద్వారా
మోడ్యూల్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదాన్ని కనిష్ఠ స్థాయికి కుదించారు.
పొయెమ్-3 ద్వారా మొత్తం 9 పేలోడ్స్‌ను రోదసిలోకి
ప్రవేశపెట్టారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థలతో రూపొందిన ఆ
పేలోడ్స్, రోదసిలో పలు వైజ్ఞానిక పరిశోధనలు చేస్తాయి. ఆ పేలోడ్స్ చేయవలసిన పనులు
ఒక్క నెల రోజుల వ్యవధిలో పూర్తయిపోయాయి.
పొయెమ్-3 అప్పర్ స్టేజ్ కక్ష్య ఎత్తును తగ్గించడానికి
రోదసిలో ఉండే ప్రకృతిసహజమైన బలాలను ఉపయోగించుకున్నారు. తద్వారా ఇంధన వినియోగాన్ని
తగ్గించారు. ఫలితంగా పొయెమ్-3, ఈ యేడాది మార్చి 21న పసిఫిక్ మహాసముద్రం
ఉత్తరభాగంలో దిగింది. ఆ క్రమంలో రోదసిలో ఎలాంటి వ్యర్థాలనూ వదలలేదనీ, వాటివల్ల
అంతరిక్షంలో జరిగే ప్రమాదాల నియంత్రణకు ఈ మోడ్యూల్ వల్ల దారి దొరికిందనీ ఇస్రో అధికారులు
వివరించారు.
తక్కువ వ్యవధి కలిగిన అంతరిక్ష ప్రయోగాలను తక్కువ
ఖర్చుతో పూర్తి చేయడానికి ఇస్రో ఈ పొయెమ్-3 ప్లాట్‌ఫాంను రూపొందించింది. తదాంతో విద్యాసంస్థలు, అంకుర సంస్థలు తమ పేలోడ్లను
ప్రయోగించడం మరింత సరళతరమైంది. ఈ వినూత్నమైన అవకాశాన్ని వాడుకుని ఇప్పటికే ఎన్నో
అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు రోదసీ ప్రయోగాలు చేస్తున్నాయి.
పీఎస్ఎల్వీ నాలుగో దశను అభివృద్ధి చేయడంలో
భాగంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈ పొయెమ్-3 మోడ్యూల్‌కు రూపకల్పన చేసింది,
దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఆ మోడ్యూల్‌ను ఉపయోగించి చేసిన ప్రయోగాల్లో
పీఎస్ఎల్వీ-సీ58 మూడవది. ఆ మోడ్యూల్ ఇప్పటివరకూ విఫలం కాలేదు.
పొయెమ్-3 మోడ్యూల్ భూకక్ష్యలోకి ప్రవేశించేవరకూ
దాన్ని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ పరిశీలించింది.
శ్రీహరికోటలోని మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ కూడా మార్చి 21 వరకూ పీఎస్4
స్టేజ్‌ను పరిశీలిస్తూనే ఉంది.
రోదసీ వ్యర్థాలు అంతరిక్ష పరిశోధనల్లో పెద్ద సమస్యగా
మారాయి. ప్రత్యేకించి చిన్నచిన్న ఉపగ్రహాలు చాలావాటిని ఒకేసారి ప్రయోగించేటప్పుడు
రోదసీ వ్యర్థాలు ఎక్కువవుతున్నాయి. ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్షంలోకి మానవుల రాకపోకలు,
అంతరిక్ష ప్రయోగాలకు ఆ వ్యర్థాలు సమస్యలు కలగజేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇస్రో, పునర్వినియోగం
చేయగల వ్యవస్థల తయారీ, రోదసీ వ్యర్థాలను గుర్తించే ఆధునిక వ్యవస్థల అభివృద్ధి,
అంతరిక్ష వస్తువులను కక్ష్యలలోనుంచి తప్పించగల టెక్నాలజీల రూపకల్పన వంటి
ప్రయోగాలకు ఇస్రో నిబద్ధతతో కృషి చేస్తోంది, తద్వారా భవిష్యత్ రోదసీ ప్రయోగాల
భద్రతకు భరోసా ఇచ్చే దిశగా ప్రయోగాలు చేస్తోంది.