ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. గత వారం ఢిల్లీ జల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం కేజ్రీవాల్, తాజాగా ఆరోగ్యశాఖకు సంబంధించిన విషయంపై మరో నోట్ పంపించారు. ఇప్పటికే తమ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ జారీ చేసిన మొదటి ఆదేశాలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీఎం కేజ్రీవాల్‌కు కలం, కాగితం ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఈడీ విచారణ చేస్తోంది.
తాజాగా మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ నుంచే రెండో ఆదేశాలు జారీ చేశారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమాచారం ఎలా పంపాడు అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కేజ్రీవాల్‌కు కలం, కాగితం, కంప్యూటర్ లాంటివి ఏవీ అందుబాటులో లేవు. అయితే రెండో ఆదేశాలు ఏ విధంగా అందాయనే దానిపై ఆప్ నేతలు స్పష్టత ఇవ్వలేదు.
కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆప్ నేతలు ఢిల్లీలో ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఆందోళనలు, నిరసనలను అనుమతించడం లేదు. మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. తరవాత కోర్టు తీర్పు మేరకు తిహార్ జైలుకు తరలించే అవకాశముంది.