కాకినాడలో వైసీపీ నేత చెలరేగిపోయాడు. కాకినాడలోని పెద్ద శివాలయంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మాజీ కార్పొరేటర్, వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావు కూడా మందీమార్భలంతో ఆలయానికి వచ్చాడు. అంతరాలయంలోకి వచ్చినా పూజరి పూజల్లో నిమగ్నమై ఉండటంతో చంద్రరావుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తాను తెచ్చిన ఆవు పాలు శివలింగంపై సరిగా పోయలేదంటూ పూజారిపై దాడికి దిగాడు. పూజారి చెంప పగుల కొట్టాడు. అర్చకుడు ప్రశ్నించడంతో, ఎదురు ప్రశ్నవేస్తావా అంటూ కాలితో తన్ని గాయపరిచాడు. ఉపాలయంలో పూజలు చేస్తోన్న మరో అర్చకుడు విజయ్‌కుమార్ వచ్చి ప్రశ్నించగా అతని చెంప కూడా పగులకొట్టాడు. మీ అంతు చూస్తానంటూ వీరంగం వేశారు. దీంతో అక్కడే ఉన్న భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వైసీపీ నేత చంద్రరావు అరాచకాన్ని అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో అర్చకులు తీవ్ర ఆందోళన చేశారు. దేవాదాయశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ అక్కడకు చేరుకుని అర్చకులతో కలసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న అర్చక ఉద్యోగిపై దాడి చేయడంతో పోలీసులు సెక్షన్ 332 కింద కేసు నమోదు చేశారు.