Indian student dies in London Road Accident
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ
చేస్తున్న భారతదేశపు యువతి చేష్ఠా కొచ్చర్ రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 19న జరిగిన ఆ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
33ఏళ్ళ చేష్ఠా కొచ్చర్ ఢిల్లీలోని గుర్గావ్
ప్రాంతానికి చెందినవారు. గతంలో ఆమె నీతి ఆయోగ్‌లో కొంతకాలం పని చేసారు. బిహేవియరల్
సైన్స్‌లో పరిశోధన చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరారు. మార్చి 19న ఇంటికి తిరిగి వెడుతున్న సమయంలో
వెనుక నుంచి ఒక లారీ గుద్దేయడంతో చేష్ఠా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆమె భర్త
ప్రశాంత్ కొంతదూరంలోనే ఉన్నారు.
లండన్‌లోని క్లెర్కెన్వెల్ రోడ్ మీద ఆ ప్రమాదం
జరిగింది. చెత్త తరలించే లారీ గుద్దేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. లారీ
డ్రైవర్ పోలీసులకు దర్యాప్తులో సహకరించాడు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్
చేయలేదు, విచారణ కొనసాగుతోందని లండన్ పోలీసులు ప్రకటించారు.
చేష్ఠా తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్
జనరల్ ఎస్పీ కొచ్చర్, ఆమె మృతదేహాన్ని తీసుకురావడానికి లండన్ వెళ్ళారు. చేష్ఠా
గతంలో ఢిల్లీ యూనివర్సిటీ, ఆశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో
విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసారు. 2021 నుంచి 2023 వరకూ నీతి ఆయోగ్‌లోని
నేషనల్ బిహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు.