ఉజ్జయిని మహాకాల్ దేవాలయంలో హోలీ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో గాయపడ్డ పూజారులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. హారతి సమయంలో చెలరేగిన మంటల్లో 14 మంది పూజారులు, దేవాలయ సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.
మహాకాల్ దేవాలయంలో పూజారులు గాయపడ్డారు అని తెలియగానే నాకు చాలా బాధేసింది. వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహాకాల్ దేవాలయంలోని గర్భగృహంలో భస్మ హారతి ఇస్తోన్న సమయంలో మంటలు అంటుకున్న 14 మంది గాయపడ్డారు. ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గురు కూడా గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రమాదం విషయం తెలియగానే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మంత్రి కైలాష్ విజయ్వర్జియా బాధితులను పరామర్శించారు. గాయపడిన పూజారులకు ఇండోర్‌లోని అరబిందో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.